ETV Bharat / opinion

ప్రభుత్వరంగ బ్యాంకుల 'ప్రైవేటీకరణ' మరో దుస్సాహసమే! - public sector banks privatization

ప్రభుత్వరంగ బ్యాంకులు వరస సంక్షోభాలతో అతలాకుతలమవుతున్నాయి. నిరర్ధక ఆస్తులు, వ్యాపార వృద్ధి క్షీణతకు తోడు కొవిడ్‌ మహమ్మారి సృష్టిస్తున్న ఆర్థిక మహోత్పాతాల వల్ల సంక్షోభం మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో పీఎస్​బీలలో కొన్నింటిని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే పీఎస్‌బీలు వృద్ధిబాట పడతాయన్నది వాస్తవం కాదు. సంక్షోభ సమయాల్లో ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలే అధికంగా ఉన్నట్లు తేలింది.

banks privatization is not the solution for crisis hit psb
పీఎస్​బీల ప్రైవేటీకరణ మరో దుస్సాహసమే!
author img

By

Published : Oct 5, 2020, 7:42 AM IST

గత కొన్నేళ్ళుగా ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్‌బీ)లు వరస సంక్షోభాలతో అతలాకుతలమవుతున్నాయి. ఒకవైపు పెరుగుతున్న నిరర్ధక ఆస్తు(ఎన్‌పీఏ)లు; మరోవైపు క్షీణిస్తున్న వ్యాపార వృద్ధి, కొవిడ్‌ మహమ్మారి సృష్టిస్తున్న ఆర్థిక మహోత్పాతాల వల్ల పీఎస్‌బీలలో సంక్షోభం మరింత తీవ్రమైంది.

భారీగా పెరుగుతున్న మొండి బకాయిల కారణంగా అధిక శాతం పీఎస్‌బీల రుణవితరణ సామర్థ్యం తగ్గడంతోపాటు బాసెల్‌ నిబంధనల మేర మూలధన నిష్పత్తిని చేరుకోలేకపోతున్నాయి. వాటిని ఆదుకోవడానికి గత అయిదారేళ్ళలో ప్రభుత్వం దాదాపు రూ.3.5లక్షల కోట్ల మూలధనాన్ని అందించింది. అయినా పీఎస్‌బీల పనితీరు ఆశించిన మేర మెరుగుపడకపోగా కొన్ని బ్యాంకులు మరింత సంక్షోభంలో కూరుకుపోయాయి.

ఎన్నో ఆటుపోట్లు...

ప్రభుత్వం కొత్తగా పీఎస్‌బీలలో కొన్నింటిని ప్రైవేటీకరించే దిశగా అడుగులేస్తోంది. గతంలోనూ పీఎస్‌బీల ప్రైవేటీకరణపై కొంత చర్చ జరిగింది. తాజాగా రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, మాజీ డిప్యూటీ గవర్నర్‌ విఠల్‌ ఆచార్య సంయుక్తంగా విడుదల చేసిన ఒక నివేదికలో పీఎస్‌బీల పనితీరును మెరుగుపరిచే దిశలో కొన్ని కీలక సిఫార్సులు చేయడమే కాక కొన్ని పీఎస్‌బీలను తిరిగి ప్రైవేటీకరించడం మేలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో ప్రైవేటీకరణ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

పీఎస్‌బీల ఏకీకరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం గతేడాది కొన్ని బ్యాంకుల మెగా విలీనాలకు శ్రీకారం చుట్టి దేశంలోని పీఎస్‌బీల సంఖ్యను 27 నుంచి 12కు తగ్గించింది. అప్పట్లో ప్రభుత్వం 6 బ్యాంకుల (బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు, పంజాబ్‌ అండ్‌ సింధ్‌బ్యాంకు, యూకో బ్యాంకు)ను విలీన పరిధి నుంచి తప్పించింది.

51 ఏళ్ళ జాతీయీకరణ ప్రస్థానంలో పీఎస్‌బీలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాయి. ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తూ సామాజిక బ్యాంకింగ్‌కు బాటలు వేసిన పీఎస్‌బీలు ప్రస్తుతం సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కొన్నింటి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం నెలకొంది.

గతంలో విచక్షణారహిత రుణ వితరణ, గత ప్రభుత్వాల అతి జోక్యం, సంస్కరణల అమలులో తీవ్ర జాప్యం వంటి కారణాలకు తోడు కొవిడ్‌ ప్రేరేపిత ఆర్థిక మాంద్యం పీఎస్‌బీల పాలిట శాపంగా మారింది. ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్ళినంత మాత్రాన పీఎస్‌బీలు వృద్ధిబాట పడతాయన్నది వాస్తవం కాదు.

అంతర్జాతీయంగా, దేశీయంగా చూస్తే- సంక్షోభ సమయాల్లో ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలే అధికంగా ఉన్నట్లు తేలింది. దేశీయంగానూ గతంలో పలు ప్రైవేటు బ్యాంకులు విఫలమయ్యాయి. అలాంటి ఆపద సమయాల్లో కొన్ని ప్రైవేటు బ్యాంకులను విలీనం చేసుకుని వాటి డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడింది ప్రభుత్వరంగ బ్యాంకులే.

2002లో అప్పటి బెనారస్‌ స్టేట్‌ బ్యాంకును బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విలీనం చేసుకుంది. 2003లో సంక్షోభంలో చిక్కుకొన్న నెడుంగడి బ్యాంకును పీఎన్‌బీ తీసుకుంది. 2004లో గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకును ఓరియంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ విలీనం చేసుకుంది. యెస్‌ బ్యాంకు ఉదంతం ప్రైవేటు బ్యాంకుల వైఫల్యాలకు, ఆ బ్యాంకుల్లో చోటు చేసుకుంటున్న తీవ్రమైన అవకతవకలకు అద్దం పడుతోంది.

గతంలో ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు పలు కొత్త తరం ప్రైవేటు బ్యాంకుల్లోనూ లొసుగులు వెలుగు చూశాయి. తాజాగా లక్ష్మీవిలాస్‌ బ్యాంకు, ధనలక్ష్మి బ్యాంకులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రైవేటు బ్యాంకులు విఫలమైనప్పుడల్లా ఆయా బ్యాంకుల డిపాజిటర్లు ఇక్కట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎస్‌బీలను ప్రైవేటీకరించే ప్రయత్నం మరో దుస్సాహసమే అవుతుంది.

ఇప్పుడేం చేయాలి?

మెగా విలీనాలతో ఇంకా కుదుటపడని పీఎస్‌బీలకు ప్రైవేటీకరణ ప్రతిపాదనలు మరింత చేటుచేయడమేకాక డిపాజిటర్లు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని బలోపేతం చేసే దిశగా అడుగులు పడాలి. పీజేనాయక్‌ కమిటీ సిఫార్సుల అమలుకు ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టాలి.

పీఎస్‌బీలలో ప్రభుత్వ వాటాను తగు జాగ్రత్తలతో 50 శాతం దిగువకు తగ్గించడంతోపాటు వాటి బోర్డులను బలోపేతం చేయాలి. ఎండీ అండ్‌ సీఈఓల పదవీకాలాన్ని మూడేళ్ళ నుంచి అయిదేళ్ళకు పెంచాలి. పీఎస్‌బీల మొండి బకాయిల సమస్యను పరిష్కరించే క్రమంలో 'బ్యాడ్‌ బ్యాంకు'ను స్థాపించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.

గతంలోనూ 'బ్యాడ్‌ బ్యాంకు' ప్రతిపాదన తెరపైకి వచ్చినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పీఎస్‌బీలకు ఊరటనిచ్చే ఈ ప్రతిపాదనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంతేకాక పీఎస్‌బీలపై ప్రభుత్వం తన అజమాయిషీని తగ్గించి అవి స్వేచ్ఛగా వ్యవహరించే వాతావరణాన్ని కల్పించాలి.

ప్రస్తుత కష్టకాలంలో పీఎస్‌బీల యజమానిగా ప్రభుత్వమే వాటి మూలధన అవసరాలను తీర్చాలి. రిజర్వు బ్యాంకు తన పర్యవేక్షణ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలి. బ్యాంకు వైఫల్యాలను ముందుగా గుర్తించి సకాలంలో అవసరమైన చర్యలు తీసుకునే దిశలో మరిన్ని సంస్కరణలు చేపట్టాలి. పీఎస్‌బీలను ప్రైవేటీకరించి దేశ బ్యాంకింగ్‌ రంగ సమతుల్యాన్ని దెబ్బతీయకుండా వాటిని మరింత బలోపేతం చేసే దిశగా అటు ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు ఇటు పీఎస్‌బీల యాజమాన్యాలు సమష్టిగా కృషి చేయాలి.

పరిగణనకు నోచుకోని సిఫార్సులు

పీఎస్‌బీల పనితీరు మెరుగుపరిచి బలోపేతం చేసేందుకు గతంలో పలు కమిటీలు కీలక సిఫార్సులు చేశాయి. వాటి అమలులో తీవ్ర జాప్యం జరగడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ఉదాహరణకు పీఎస్‌బీల విలీనాలపై 18 ఏళ్ళ క్రితం నరసింహం కమిటీ చేసిన సిఫార్సులు గతేడాది కార్యరూపం దాల్చాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆ విలీనాలు ఎంతమేర ప్రయోజనకరమనేది ప్రశ్నార్థకం. పీఎస్‌బీల బోర్డులను మరింత బలోపేతం చేసి వాటి పనితీరును మెరుగుపరిచే దిశలో 2014లో పీజే నాయక్‌ కమిటీ చేసిన కీలక సిఫార్సుల్లో ఇంకా కొన్ని అమలు కావాల్సి ఉంది.

గత అయిదారేళ్ళలో మోదీ ప్రభుత్వం బ్యాంకింగ్‌ రంగంలో పలు సంస్కరణలు చేపట్టింది. పీఎస్‌బీల పర్యవేక్షణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించే దిశలో ఆర్‌బీఐ కూడా పలు చర్యలు చేపట్టింది. అయినా వాటి పనితీరు మెరుగు పడలేదు. కొన్నింటిలో మొండిబకాయిల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

-తుమ్మల కిశోర్, (రచయిత- బ్యాంకింగ్‌ రంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.