ప్రాగ్దిశాకాశంలో వినూత్న తారగా పండిత నెహ్రూ జోతలందుకొన్న స్వతంత్ర భారతికి మరో 75 వారాల్లో 75 వసంతాలు నిండనున్నాయి. ఆ చారిత్రక సందర్భాన్ని చిరస్మరణీయం చేయడమే కాదు- దేశ పౌరుల్లో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రగుల్కొల్పడమే లక్ష్యంగా ప్రధాని మోదీ సంకల్పించిన స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలు నేటి నుంచే మొదలు కానున్నాయి. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఉప్పు సత్యాగ్రహం ఓ మహోజ్జ్వల ఘట్టం. నాటి దండి సత్యాగ్రహ స్ఫూర్తికి నివాళులు అర్పిస్తూ 91 సంవత్సరాల తరవాత సరిగ్గా అదే రోజున నేటి అమృతోత్సవానికి శ్రీకారం చుట్టడం- జాతి చేతన మహా క్రతువుకు శుభారంభం! దేశవ్యాప్తంగా చారిత్రక ప్రాధాన్యం గల 75 చోట్ల వారానికొక ప్రముఖ ఘట్టాన్ని పండగలా నిర్వహించాలన్న సంకల్పం- మరుగున పడిన ఎన్నెన్నో మహోద్విగ్న క్షణాల్ని భరత జాతి కళ్లకు కట్టనుంది. దేశంకోసం మరణించే మహదవకాశం మనకు లభించకపోయినా దేశం కోసం బతుకుదామని అయిదేళ్లనాడు ఉద్బోధించిన మోదీ- స్వాతంత్య్రానంతర కాలంలో పుట్టిన మొట్టమొదటి ప్రధాని.
జాతి ఐక్యతే ధ్యేయం..
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తుల పునాదుల్ని ఉపఖండం నుంచి పెకలించి, స్వాతంత్య్ర భానూదయం కోసం ఎన్నెన్ని లక్షలమంది ఉద్యమ సూరీళ్లు అస్తమించారన్న వాస్తవం తెలియకుండానే ఎన్నో తరాలు ఎదిగొచ్చాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఎన్నో దేశాల విముక్తి పోరాటాలకు బావుటాగా నిలిచిన భారతావని స్ఫూర్తి- దేశ పౌరుల మనో ఫలకాలకు ఎక్కక పోబట్టే- 'ఈ దేశం నాకేమిచ్చింద'న్న నిస్పృహ వాదం యువజనం నోటినుంచే వినవస్తోంది. త్యాగధనుల అసిధారా వ్రతంతో పునీతమైన గతాన్ని నేటి తరానికి స్ఫూర్తిమంత్రంగా అందించే మహా క్రతువు అన్ని రాష్ట్రాల్లోనూ సత్యనిష్ఠతో సాగాలి. అమృతోత్సవ ఘడియల్లో ఆలోచనలు, విజయాలు, కార్యాచరణలు, సంకల్పాలు పౌర సమాజ భాగస్వామ్యంతో మరింతగా తేజరిల్లి వచ్చే పాతికేళ్ల అజెండాతో భారత ప్రగతి ప్రస్థానానికి మేలుబాటలు పరవాలి!
సమస్యలపై క్విట్ ఇండియా..
ఆనాడు స్వాతంత్య్రోద్యమ సమర సేనానుల పిలుపు అందుకొని బానిసత్వ శృంఖలాలు తెగతెంచడమే లక్ష్యంగా వలస పాలకుల కరకు తూటాలకు ఎదురొడ్డి ప్రాణాల్నే తృణప్రాయంగా త్యజించిన భరతమాత ముద్దుబిడ్డల వీరగాథలతో ప్రతి ఊరూ శిరసెత్తుకు నిలిచింది. ఆ స్ఫూర్తిని పునరుజ్జీవింప చేసి స్థానిక స్వాతంత్య్ర అమర యోధులకు సామాజిక గుర్తింపు గౌరవం దక్కేలా 75 వారాల కార్యాచరణ ఫలప్రదం కావాలి. దేశ ప్రజల మధ్య అంత క్రితం లేని ఐకమత్యాన్ని 'క్విట్ ఇండియా' సాధించిందంటూ, నాటి 'భారత్ ఛోడో' నినాదాన్ని నేడు 'భారత్ జోడో'గా మలచి పౌరుల నడుమ దేశభక్తి ప్రపూరిత సంఘటితత్వాన్ని పేనడం ద్వారా నవభారత నిర్మాణం సాగించాలని 2017లో ప్రధాని మోదీ అభిలషించారు. ఆ లక్ష్యసాధనకు ఆజాదీ అమృతోత్సవం అద్భుతంగా అక్కరకు రాగలుగుతుందనడంలో సందేహం లేదు.
సంఘటిత శక్తి..
సగటు పౌరుల జీవితాల్లో మేలిమి మార్పు తీసుకు రావడమే సురాజ్య భావన పరమార్థమైతే ఆ దిశగా జనవాహిని స్థిర సంకల్పంతో అడుగులు కదపడానికి ఇదే సరైన అదను. 74 ఏళ్ల కాలావధిలో ఇండియా తన సహజ శక్తి సామర్థ్యాల మేరకు ఎదగలేకపోవడానికి పుణ్యం కట్టుకొన్న అవరోధాల్లో జాతీయతా స్ఫూర్తితో కదం తొక్కే సంఘటితత్వం కొరవడటమూ ఒకటి. ప్రస్తుతం ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న ఇండియా 2025నాటికి బ్రిటన్‌ను దాటి అయిదో స్థానానికి, 2030నాటికి మూడో స్థానానికీ చేరగలదని అధ్యయనాలు చాటుతున్నాయి. వలస పాలకుల్ని బెంబేలెత్తించిన దండి సత్యాగ్రహం నాటి సంఘటిత శక్తి, స్వావలంబన స్ఫూర్తి తిరిగి పాదుకొంటే భారతావని ప్రగతి వేగం మరింత పుంజుకొంటుంది. తొలిసారి మహిళా చేతన జూలు విదిల్చి దండియాత్రను దిగ్విజయవంతం చేసినట్లే- స్త్రీ సాధికారతకు చోటుపెట్టే బహుముఖ చొరవతోనే భావి భారత భాగ్యోదయం సాక్షాత్కరిస్తుంది!
ఇవీ చదవండి:
'అమృత్ మహోత్సవ్'కు నేడు మోదీ శ్రీకారం