అగ్రరాజ్యం అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల ఏరువాక మొదలైంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి, అన్నింటా అమెరికన్లకే తొలి ప్రాధాన్యమిచ్చి, వారి చేతుల మీదుగానే దేశ పునర్నిర్మాణం చేపడతామంటూ 45వ దేశాధ్యక్షుడిగా ప్రతిన పూనిన డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పనిపోకడలపై వచ్చే నవంబరు మూడున అమెరికా జనవాహిని తీర్పు ఇవ్వనుంది. ప్రెసిడెంట్ ఒబామాకు జోడీగా రెండు పర్యాయాలు ఉపాధ్యక్ష బాధ్యతలు నిర్వహించి అపార రాజకీయ అనుభవశాలిగా కీర్తి గడించిన జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా బరిలో దిగడం, ఉపాధ్యక్ష అభ్యర్థిగా భారతీయ మూలాలు గల కమలా హారిస్‌ను ఎంచుకోవడంతో- అగ్రరాజ్యంలో రాజకీయాలు రక్తికడుతున్నాయి. అమెరికాపై కరోనా కర్కశంగా కోరసాచడానికి ముందుదాకా ట్రంప్ పునరధికారానికి ఢోకా లేదన్నట్లుగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా తిరగబడ్డాయి. దాదాపు 60 లక్షల కేసులు, లక్షా 82 వేల మరణాలతో అమెరికా భీతిల్లుతున్న నేపథ్యంలో- అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వేయాలన్న సూచనకు శ్వేతసౌధాధిపతే శ్రుతి చేశారు. గతంలో ప్రపంచయుద్ధం, స్పానిష్ ఫ్లూ, మహామాంద్యాలు ముంచుకొచ్చినప్పుడూ ఎన్నికల వాయిదా ఆలోచనే చెయ్యని అగ్రరాజ్యం- ఆ ఆనవాయితీకే కట్టుబడుతోందిప్పుడు! కరోనా నుంచి ఓటర్ల రక్షణ కోసం ‘మెయిల్ ద్వారా ఓటింగ్’కు అనుమతిస్తుంటే- ఆ విధానంలో అక్రమాలు విక్రమిస్తాయని, ఆ ఫలితాల్ని ఆమోదించే ప్రసక్తే లేదని ట్రంప్ హుంకరిస్తున్నారు! అమెరికా ఎన్నికల ప్రక్రియలో పలు దేశాలు జోక్యం చేసుకొనే ప్రమాదాన్ని ప్రస్తావించిన నిఘా వర్గాలు- ముఖ్యంగా చైనా రష్యా ఇరాన్ల చేతివాటంపై హెచ్చరిస్తున్నాయి. క్రితంసారి హిల్లరీ క్లింటన్‌కు పొగపెట్టి తనకు మద్దతుగా రష్యా నెరపిన తెరచాటు రాజకీయంపై విచారణలో త్రుటిలో తప్పించుకొన్న ట్రంప్- 'బీజింగ్ బైడెన్' అంటూ ప్రత్యర్థిని ఆడిపోసుకోవడమే వైచిత్రి!
ప్రపంచానికి పెద్దదిక్కుగా బాధ్యతాయుతంగా సాగాల్సిన అమెరికా నడవడిని మార్చిన ట్రంప్ ఎంత ప్రమాదకర ఒరవడి దిద్దారో 44 నెలల పదవీకాలమే ప్రస్ఫుటీకరిస్తోంది. వాతావరణ మార్పుల కట్టడిని లక్షించిన ప్యారిస్ ఒప్పందాన్ని, ఇరాన్ అణు నిరాయుధీకరణకు బాటలుపరచే బహుపాక్షిక ఒడంబడికను కాలదన్ని, వాణిజ్య యుద్ధాలకు తెరతీసిన ట్రంప్ తెంపరితనం రాజేసిన సంక్షోభాగ్నులు లెక్కలేనన్ని! అమెరికా విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేసి ఏకపక్ష దిశకు మళ్ళిస్తానన్న ట్రంప్- ఉత్తర కొరియాకు స్నేహ హస్తం అందించి, తాలిబన్ తండాలతో ఒప్పందానికి తలూపి- ఇదమిత్థంగా సాధించినదేముంది? చైనా, జపాన్, మెక్సికో, వియత్నాం, ఇండియా వంటి దేశాలు అమెరికాను దోచుకొంటున్నాయంటూ ఎలుగెత్తి, ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా నిర్ణయాలతో ట్రంప్ మహాశయులు సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. మానవాళికే మహావిపత్తుగా దాపురించిన కొవిడ్ కట్టడికి పరిణత వ్యూహం లేక, శ్వేత జాత్యహంకారం ఆఫ్రో-అమెరికన్లను బలిగొంటున్నా ఖండించడానికి నోరు రాక- ట్రంప్ ఏలుబడి ఎనలేని అప్రతిష్ఠ మూటకట్టుకొంది. అంటువ్యాధులపై గట్టి నిఘా పర్యవేక్షణలకోసం శ్వేతసౌధంలో తాము ప్రత్యేక యంత్రాంగాన్ని కొలువుతీరిస్తే, ట్రంప్ దాన్ని రద్దు చేశారంటున్న బైడెన్ వ్యాఖ్యలు రిపబ్లికన్లను స్వీయరక్షణలో పడేస్తున్నాయి. క్రితంసారి హిల్లరీ క్లింటన్ కంటే 29 లక్షల ఓట్లు తక్కువగా వచ్చినా, ఎలెక్టోరల్ కాలేజీలో 306 స్థానాలు దక్కించుకొని ట్రంప్ జయకేతనం ఎగరేయడానికి శ్రామిక ఉద్యోగ వర్గాల మద్దతు ఎంతగానో అక్కరకొచ్చింది. ఉపాధి ఉద్యోగాల్ని ఊడ్చేసి జన జీవన సౌభాగ్యాన్ని కరోనా కబళిస్తున్న తరుణంలో ఓటర్లు ఎవరి పక్షం మొగ్గుతారన్నది- అమెరికాతోపాటు ప్రపంచ గమనాన్నీ నిర్దేశించనుంది!