ఇంట్లో అరడజను కోడిగుడ్లు ఉన్నాయంటే చాలు... వాటితో భోజనంలోకి నోరూరించే పదార్థాలే కాదు.. సాయంత్రం పూట స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. అలాంటి రుచులు కొన్ని మీకోసం.!
కబాబ్
కావలసినవి:
గుడ్లు: మూడు (ఉడికించి పొడుగాటి ముక్కల్లా కోసుకోవాలి), ఉడికించిన బంగాళాదుంపలు: మూడు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, అల్లం తరుగు: చెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు రెబ్బలు: రెండు,పసుపు: అరచెంచా, మిరియాలపొడి: పావుచెంచా, గరంమసాలా: చెంచా, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, గుడ్డు: ఒకటి, పాలు: రెండు టేబుల్‌స్పూన్లు, బ్రెడ్‌పొడి: ముప్పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి చెంచా నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు... ఉల్లిపాయముక్కలు, కరివేపాకు, ఉప్పు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక పసుపు, మిరియాలపొడి, గరంమసాలా వేసి బాగా కలిపి... బంగాళాదుంప ముక్కలు వేసి ముద్దలా చేసుకోవాలి. నిమిషమయ్యాక కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు వేసి కలిపి దింపేయాలి. గుడ్డుసొనలో పాలు, చిటికెడు ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని కొద్దిగా బంగాళాదుంప ముద్దను తీసుకుని అరచేయంత మందంలో పల్చగా చేసి అందులో ఒక గుడ్డు ముక్కను ఉంచి అంచుల్ని జాగ్రత్తగా మూసేయాలి. ఇలా చేసుకున్న దాన్ని మొదట గుడ్డు సొనలో తరువాత బ్రెడ్‌పొడిలో అద్ది కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇదేవిధంగా మిగిలినవీ చేసుకోవాలి.
ఆలూ ఆమ్లెట్
కావలసినవి:
గుడ్లు: ఆరు, పచ్చిమిర్చి: మూడు, బంగాళాదుంపలు: రెండు పెద్దవి, నూనె: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, వేయించిన ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, ఉప్పు: తగినంత, చీజ్‌స్లైసు: ఒకటి.
తయారీ విధానం: బంగాళాదుంపల పొట్టు తీసి చిన్న ముక్కల్లా కోయాలి. తరువాత స్టౌమీద కడాయి పెట్టి ముప్పావు వంతు నూనె వేసి బంగాళాదుంప ముక్కల్ని వేయించుకుని తీసుకోవాలి. గుడ్ల సొనను ఓ గిన్నెలో వేసి నురగ వచ్చేవరకూ గిలకొట్టుకుని అందులో మిగిలిన పదార్థాలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టౌమీద పెనం పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడెక్కాక సిద్ధంగా పెట్టుకున్న మిశ్రమం వేసి స్టౌని మీడియంలో పెట్టాలి. ఆమ్లెట్ పూర్తిగా తయారయ్యాక మరోవైపు కూడా తిప్పి కాల్చుకుని ఆ తరువాత కావాల్సిన ఆకృతిలో ముక్కల్లా కోసుకోవాలి.
పాలక్ ఎగ్
కావలసినవి:
ఉడికించిన గుడ్లు: ఎనిమిది, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, టొమాటోలు: రెండు, పాలకూర తరుగు: రెండు కప్పులు, అల్లంవెల్లుల్లి ముద్ద: టేబుల్‌స్పూను, జీలకర్ర: చెంచా, బిర్యానీఆకులు: రెండు, యాలకులు: రెండు, పసుపు: అరచెంచా, దనియాలపొడి: చెంచా, కారం: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత, గరంమసాలా: చెంచా, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం: పాలకూరను కడిగి... వేడినీళ్లలో వేసి అయిదు నిమిషాలయ్యాక తీసి చల్లని నీటిలో వేయాలి. తరువాత ఆ నీటిని కూడా వంపేసి పాలకూరను మిక్సీలో వేసి ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌమీద కడాయి పెట్టి నూనె వేసి జీలకర్ర వేయించాలి. అందులోనే బిర్యానీఆకులు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి... రెండు నిమిషాలయ్యాక పసుపు, దనియాలపొడి, కారం, ఉప్పు, గరంమసాలా వేసి బాగా కలిపి... నిమిష మయ్యాక టొమాటో ముక్కలు, పాలకూర ముద్ద వేయాలి. టొమాటో ముక్కలు వేగి నూనె పైకి తేలుతున్నప్పుడు ఉడికించిన గుడ్లను ముక్కల్లా చేసి వేసి... అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.
ఎగ్ 65
కావలసినవి:
ఉడికించిన గుడ్లు: ఆరు, మొక్కజొన్నపిండి: నాలుగు టేబుల్‌స్పూన్లు, గుడ్డు: ఒకటి, మిరియాలపొడి: అరచెంచా, వెల్లుల్లి తరుగు: చెంచా, అల్లం తరుగు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: మూడు, కారం: రెండు చెంచాలు, చిక్కని పెరుగు: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, చిల్లీసాస్: టేబుల్‌స్పూను, సోయాసాస్: చెంచా, క్యాప్సికం ముక్కలు: పావుకప్పు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం: ఉడికించిన గుడ్లను ముక్కల్లా కోసి పెట్టుకోవాలి. గుడ్డు సొనను ఓ గిన్నెలో తీసుకుని మొక్కజొన్నపిండి, తగినంత ఉప్పు, చెంచా కారం, మిరియాలపొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. గుడ్డు ముక్కలను ఒక్కొక్కటిగా మొక్కజొన్న మిశ్రమంలో ముంచి
కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద మళ్లీ బాణలి పెట్టి టేబుల్‌స్పూను నూనె వేసి పచ్చిమిర్చి, కరివేపాకు అల్లం, వెల్లుల్లి తరుగు వేసి బాగా కలపాలి. తరువాత పెరుగు, క్యాప్సికం ముక్కలు, మిగిలిన కారం, సోయాసాస్, చిల్లీసాస్, కొద్దిగా ఉప్పు వేయాలి. నిమిషం అయ్యాక ముందుగా వేయించుకున్న గుడ్డు ముక్కలు కూడా వేసి కలిపి...వాటికి మసాలా పట్టిందనుకున్నాక స్టౌ కట్టేయాలి.
ఇదీ చూడండి: కశ్మీరి చిల్లీ మటన్.. చూస్తేనే నోరూరెన్..!