శ్రావణం శుక్రవారం నాడు వ్రతంలో అలంకరణదీ ప్రధాన పాత్రే! అలాగని పూలే అక్కర్లేదు. ఆకులతోనూ అందంగా తీర్చిదిద్దొచ్చు అంటున్నారు డెకార్ బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. ఇందుకు కొన్ని సూచనలూ చేస్తున్నారు.
* రెండు కర్రలు నిలువుగా, ఒక కర్ర అడ్డంగా వచ్చేలా ఓ ఫ్రేమ్ ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఆకుపచ్చ రంగు కర్టెన్ వేలాడదీయండి. ఆ వస్త్రంపై అరిటాకులు/ విస్తరాకులు/ తమలపాకులు వంటి వాటిని గుండు సూదులతో అతికించాలి. చివరగా అక్కడక్కడా పూలు పెడితే.... నిండుగా కనిపిస్తుంది.
* ఆకులతో ఉన్న అరటిపిలకను బిందెల్లో మట్టిపోసి పీటకు అటూ ఇటూ పెట్టినా పచ్చదనంతో అలరారుతుంది. గోధుమలు, ధాన్యం వంటివి చిన్న చిన్న డబ్బాల్లో మొలకెత్తించి పూజ మండపం చుట్టూ పెట్టినా బాగుంటుంది.
* ఇక, మామిడాకులు, కొబ్బరాకులతో తోరణాలు సులువుగా చేసుకోవచ్చు. అరటి/ కొబ్బరి ఆకులతో చక్కటి చిలుకలు చేసుకోవచ్చు. అరిటాకులు, విస్తరాకులతో చిన్న చిన్న ప్లేట్లు, గిన్నెలు చేసుకుంటే... ప్రసాదాల రుచి పెరుగుతుంది. అలాంటి కొన్ని డిజైన్లే ఇవన్నీ... ఇవి చూస్తే మీకూ మరిన్ని ఆలోచనలు రావొచ్చు.
ఇదీ చదవండి: శ్రావణం స్పెషల్: ఈ వెరైటీలు ట్రై చేయండి!