తమకున్న దాంట్లో కలో, గంజో తాగినా.. తన కూతుర్ని మాత్రం ఉన్నత కుటుంబంలోకి పంపించాలని ఆరాటపడుతుంటారు చాలామంది తండ్రులు. మా నాన్న కూడా అంతే! మా అమ్మానాన్నలకు లేకలేక కలిగిన సంతానాన్ని నేను. నాన్న ఆర్‌ఎంపీగా పని చేసేవారు. అమ్మ గృహిణి. ఆస్తులు, అంతస్తులు లేకపోయినా ఉన్నదాంట్లో సంతోషంగా ఉండడమే మాకు తెలుసు. ఈ ఆనందమే అమ్మానాన్న నాకు బహుమతిగా ఇచ్చారని చెప్తా. చిన్నప్పట్నుంచీ చదువులో చురుగ్గా ఉండేదాన్ని.
డిగ్రీ సెకండియర్ పరీక్షల సమయంలో తెలిసిన వాళ్ల దగ్గర్నుంచి నాకు ఓ మంచి సంబంధం వచ్చింది. అది అమ్మానాన్నలకు నచ్చింది. అబ్బాయి బుద్ధిమంతుడు.. విద్యావంతుడు.. వీటికి తోడు వాళ్లకు ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ఇదే నా కూతురుకు తగిన సంబంధం అని సంబరపడిపోయాడు నాన్న. ఈ విషయాలన్నీ నాతో చెప్పి నా నిర్ణయం చెప్పమన్నాడు. పైచదువుకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సి వస్తుందేమోనన్న భయం తప్ప ఆ సంబంధం వద్దని చెప్పడానికి నాకు ఒక్క కారణం కూడా కనిపించలేదు. పెళ్లయ్యాకైనా చదువు కొనసాగించచ్చులే అన్న ఉద్దేశంతో.. నా మనసులోని కోరికను నాన్నకు చెప్పి సరేనన్నా. నా పైచదువుకు నాకు కాబోయే భర్త సుదీప్, మా అత్తింటి వాళ్లూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హ్యాపీగా పెళ్లికి రడీ అయిపోయా. చూస్తుండగానే పెళ్లైపోయింది.. అత్తారింట్లో అడుగుపెట్టా. వాళ్లదీ పుణేనే కావడంతో.. అమ్మానాన్నలకు కాస్త దూరంగా ఉన్నా.. ఒకే ఊర్లో ఉన్నామన్న సంతృప్తి నాకు మిగిలింది.
కొత్త కాపురం, మంచి భర్త.. సంసారం ఇలా సంతోషంగా సాగిపోతోంది.. చూస్తుండగానే మూడేళ్లు గడిచాయి.. నా పీజీ కూడా పూర్తయింది. అప్పటికే మా బంధువులు, ఇరుగుపొరుగు వాళ్లు ‘పెళ్లై మూడేళ్లైంది.. శుభవార్త ఎప్పుడు చెప్తారు?’ అని పదే పదే అడుగుతుండేవారు. కాస్త ఇబ్బందిగా అనిపించినా నేను, నా భర్త ఏదో ఒకటి చెప్పి ఆ మాటల్ని దాటేసేవాళ్లం. అయితే అదే ఏడాది నేను నెల తప్పాను. తొలుచూరు సంతానం.. ఆడపిల్లైతే ఇంటికి మహాలక్ష్మి.. అందుకే అమ్మాయే పుట్టాలని బలంగా కోరుకున్నా.. ఇదే విషయాన్ని మా ఆయనతో పదే పదే చెబుతుండేదాన్ని. కానీ ఆయన మాత్రం మాకు అబ్బాయే పుట్టాలని కోరుకునేవాడు. అయినా అది మన చేతుల్లో లేదు.. దేవుడు ఎవరినిచ్చినా సంతోషమే అనుకున్నా. అంతలోనే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. పురుడు కోసం పుట్టింటికి వచ్చేశా. నేననుకున్నట్లుగానే తొలుచూరు మాకు మహాలక్ష్మి పుట్టింది.. పట్టరానంత సంతోషంలో నేనుంటే.. నా పక్కనే ఉన్న నా భర్త మొహంలో ఏదో వెలితి కనిపించింది. తను అనుకున్నట్లుగా బాబు పుట్టలేదు కదా.. అందుకేనేమో ఈ మౌనం.. కొన్నాళ్లు పోతే తనే మారతాడులే అనుకున్నా.
పాప ఆలనా పాలనలోనే రెండేళ్లు గడిచిపోయాయి. ఈలోపే మావారి వ్యాపార రీత్యా ఆస్ట్రియా వెళ్లిపోయాం. అక్కడికెళ్లాకే రెండో బేబీ కోసం ప్లాన్ చేసుకుందామని నిర్ణయించుకున్నాం. అయితే ఈసారి మాత్రం బాబే కావాలంటూ పట్టుబట్టారు మా ఆయన. సరదాగా అంటున్నారేమో అనుకున్నా.. కానీ స్కానింగ్ కోసం వెళ్లినప్పుడు నా కడుపులో పెరుగుతోంది పాప అని తెలుసుకొని అప్పుడే అబార్షన్ చేయించేశారు. తను అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత ఎనిమిది నెలలకు మళ్లీ గర్భం దాల్చాను. ఆయనది మళ్లీ అదే వరస. ఇలా ఒకట్రెండు సార్లు కాదు.. ఈసారి కంటే కొడుకునే కనాలని సుమారు పదిసార్లు అబార్షన్ చేయించి ఉంటాడు. దీనికి తోడు మధ్యమధ్యలో కొన్ని సార్లు ప్రెగ్నెన్సీ కన్‌ఫర్మ్ అయి దానంతటదే అబార్షన్ అయిపోయేది. ఇలా రోజురోజుకీ మితిమీరుతోన్న తన ప్రవర్తన చూసి నాకే ఆశ్చర్యం కలిగేది. కొన్నాళ్లు పోయాక అప్పుడప్పుడూ తాగొచ్చి కొట్టడం, మాటలతో హింస పెట్టడం కూడా చేసేవాడు.
రోజులు గడిచే కొద్దీ వారసుడే కావాలన్న పిచ్చి తనలో ముదురుతూ వచ్చింది. అదెంతలా అంటే.. కొడుకే పుట్టాలని తను కూడా కొన్ని రకాల చికిత్సలు చేయించుకున్నాడు. నాకు కూడా పలు ట్రీట్‌మెంట్స్, ఆపరేషన్లు చేయించాడు. ఈ క్రమంలో నాకు వందలాది హార్మోనల్, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వేయించాడు. ఆయన ప్రవర్తన భరించలేక, అమ్మానాన్నల్ని బాధపెట్టడం ఇష్టం లేక.. అత్తమామలకు విషయం చెప్పి చూశా. కానీ వాళ్లూ ఆయన వైపే మొగ్గు చూపారు. ఆయనకు కొడుకు పిచ్చేమో గానీ ఈ చికిత్సలన్నీ నా ప్రాణాల మీదకు వచ్చేలా ఉన్నాయనిపించింది. నాకేమైనా అయితే నా కూతురు అనాథవుతుందన్న భయంతో ఎలాగోలా ఇండియాకు చేరుకున్నా.
ఇక ఈ వెర్రి భర్తతో వేగలేనని పెట్టాబేడా సర్దుకొని పుట్టింటికి వెళ్లిపోయా. ఇన్నాళ్లూ ఎదుర్కొన్న వేదనను అమ్మానాన్నలతో పంచుకొని భోరుమన్నా.. కొడుకే కావాలని ఇన్నాళ్లూ వేధించిన నా మూర్ఖపు భర్తతో విడిపోవడానికి నిర్ణయించుకున్నా. నాలాంటి దుస్థితి మరే మహిళకూ రాకూడదని.. నా భర్తపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇన్నాళ్లూ శారీరకంగా, మానసికంగా క్షోభను అనుభవించిన నేను ఇకపై సింగిల్ మదర్‌గా కొనసాగాలనుకుంటున్నా. అయినా ఆడది గర్భం దాల్చినంత మాత్రాన కొడుకునే కనాలని లేదు.. వారసుడు పుట్టకపోతే అది తన తప్పు కాదు.. అమ్మ, అక్క, చెల్లి, ఆలి.. ఇలా మగాళ్ల జీవితంలో అన్ని దశల్లోనూ ఆడవాళ్ల అవసరం ఉన్నప్పుడు.. కూతురి విషయంలోనే ఎందుకీ వివక్ష! నేను చెప్పింది తప్పంటారా?! మీరే చెప్పండి.
ఇదీ చూడండి: రెండు రోజుల కిందటే జన్మనిచ్చి.. 140 కిలోమీటర్లు దాటొచ్చి..