మా అమ్మాయి వయసు పద్దెనిమిదేళ్లు. రెండేళ్లుగా తను మమ్మల్ని పెళ్లి చేయమని తొందరపెడుతోంది. తనే మ్యాట్రిమోనీ సైట్లలో వివరాలు అప్‌లోడ్ చేసి వెతుక్కుంటోంది. చదువుపై దృష్టిపెట్టడం లేదు. అలాగని సంబంధాలు వెతికి తెచ్చినా... తన అందం, వయసు, స్థాయికి సరిపోవడం లేదంటోంది. అసలు తనకేం కావాలో తెలియడం లేదు. ఇదేమైనా మానసిక సమస్యా?
పెళ్లి చేయమని ఏ మాత్రం బిడియం, సంకోచం లేకుండా అమ్మాయి ఒత్తిడి చేయడం సాధారణ విషయం కాదు అంటున్నారు ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ బండారి గౌరీదేవి. ఈ లక్షణాలతోపాటు డబ్బు ఎక్కువగా ఖర్చు చేయడం, అతిగా సంతోషపడటం, ఇతర అంశాల మీద ఆసక్తి లేకపోవడం, తనకు తాను గొప్పగా భావించడం...లాంటి లక్షణాలుంటే దాన్ని మానసిక రుగ్మతగా భావించొచ్చని తెలిపారు.
కుటుంబంలో ఎవరికైనా గతంలో మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తొచ్చని చెప్పారు. అలానే తెలివితేటలు తక్కువగా ఉన్నవారికి పరిణతి కూడా తక్కువే ఉంటుందని, ఇతరులను చూసి తామూ పెళ్లి చేసుకోవాలనుకుంటారన్నారు. అలా చేస్తే నగలు, దుస్తులు కొనుక్కోవచ్చనీ, సంతోషంగా గడిపేస్తామనీ అపోహ పడుతుంటారని చెప్పారు. ఇలాంటి లక్షణాలు ఉంటే సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. పరీక్షల తర్వాత... కౌన్సెలింగ్‌తో సరిపోతుందా? లేదా మందులు అవసరమా అన్నది నిర్ణయిస్తారని డాక్టర్ గౌరీదేవి తెలిపారు.
- ఇదీ చదవండి : ఆగని నరమేధం- నిర్లక్ష్యమే ఘోరకలికి కారణభూతం!