అధిక నీటి నిల్వ..
నెలసరి సమయంలో చాలామంది మహిళలు బరువు పెరగడానికి వారు తీసుకునే నీరు కూడా ఒక కారణమట! అదెలాగంటే.. ఈ సమయంలో శరీరంలోని కణజాలాలు నీటిని ఎక్కువగా నిలుపుకుంటాయి. ఇలా నిల్వ ఉన్న నీటిపై, పిరియడ్స్ వచ్చినప్పుడు హార్మోన్ల స్థాయుల్లో జరిగే మార్పుల ప్రభావం ఉంటుంది. ఫలితంగా పొట్ట ఉబ్బరం, కడుపునొప్పి, ఆయాసం, పాదాల వాపు.. వంటివి వచ్చే అవకాశాలుంటాయి. ఇది కూడా బరువు పెరగడానికి ఓ కారణమే. అయితే దీనికి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదట. ఎందుకంటే రుతుచక్రం పూర్తయిన తర్వాత ఈ నీటి స్థాయులు తిరిగి అదుపులోకి వస్తాయి. తద్వారా బరువు క్రమంగా తగ్గుముఖం పడుతుందంటున్నారు నిపుణులు.
అవి తినడం వల్ల..
చాలామంది మహిళలకు నెలసరి సమయంలో ఆహారం ఎక్కువగా తీసుకోవాలనే కోరిక పెరుగుతుందట. దీంతో అది ఆరోగ్యకరమైందా? ఎక్కువ క్యాలరీలున్న ఆహారమా?.. వంటివేమీ ఆలోచించకుండా ఆకలిని తీర్చుకొనేందుకు.. పిజ్జా, బర్గర్, కొవ్వులు అధికంగా ఉండే ఫాస్ట్‌ఫుడ్స్.. ఇలా నచ్చిన ఆహారపదార్థాలు ఎక్కువ మొత్తంలో తింటుంటారు. ఇవి శరీరానికి శక్తినివ్వడమేమోగానీ.. మనల్ని శారీరకంగా మరింత బద్ధకించేలా చేస్తాయి. దీంతో వ్యాయామం చేయడానికి శరీరం అస్సలు సహకరించదు. ఫలితంగా శరీరంలో పేరుకొన్న అనవసర కొవ్వులు శారీరక బరువును క్రమంగా రెట్టింపుచేస్తాయి. మరి, ఈ బద్ధకాన్ని వదిలించుకొని యాక్టివ్‌గా ఉండాలంటే పిరియడ్స్ సమయంలోనూ చిన్న చిన్న, తేలికపాటి వ్యాయామాలు చేయడం ఉత్తమం.
ఇన్సులిన్ స్థాయి పెరగడం..
రుతుక్రమం సమయంలో ఎక్కువమంది మహిళల్లో ఆహారం తీసుకోవాలనే కోరిక పెరగడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? శరీరంలోని మెగ్నీషియం స్థాయులు పడిపోవడం ద్వారా అది ఇన్సులిన్ స్థాయుల్ని క్రమంగా పెంచుతుంది. ఫలితంగా ఈ సమయంలో కార్బొహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలనిపిస్తుంది. ఇలాంటి పదార్థాలు కూడా పరోక్షంగా శరీర బరువును పెంచడానికి దోహదం చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో మెగ్నీషియం ఎక్కువగా లభించే నట్స్, గింజలు, బీన్స్, అరటిపండ్లు, డార్క్‌చాక్లెట్.. వంటివి ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
మరిన్ని...
* నెలసరి సమయంలో కలిగే ఒత్తిడి, చికాకు వల్ల తీసుకునే ఆహారం మోతాదు పెరిగి.. తద్వారా శరీర బరువు ఎక్కువవుతుందట!
* వయసును బట్టి కూడా నెలసరి సమయంలో చాలామంది మహిళలు బరువు పెరుగుతుంటారట. వయసు పైబడుతున్నకొద్దీ శరీరంలో జీవక్రియలు క్రమంగా మందగించడమే ఇందుకు కారణమంటున్నారు సంబంధిత నిపుణులు.
సమస్య నుంచి విముక్తికి..
స్త్రీలలో రుతుక్రమ సమయంలో బరువు పెరిగే సమస్యను కొంత వరకు తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా సూచిస్తున్నారు నిపుణులు.
* ఆహారంలో సోడియం తక్కువగా ఉండేలా జాగ్రత్తపడాలి.
* చక్కెరలు, కార్బొహైడ్రేట్లు తీసుకోవడాన్ని వీలైనంత వరకు తగ్గించాలి.
* జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్, క్యాల్షియం అధికంగా లభించే పదార్థాలకు మెనూలో చోటు కల్పించాలి.
* గోరువెచ్చని నిమ్మరసం తాగాలి.
* పెరుగు, పుదీనా టీ, అరటిపండ్లు, అనాస.. వంటి కడుపులో గ్యాస్ సమస్య ఏర్పడకుండా నివారించే పదార్థాలను.. ఆహారంలో భాగం చేసుకోవాలి.
అలాగే వీటితో పాటు రోజూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు.
నెలసరి సమయంలో కొంతమంది మహిళల్లో బరువు పెరిగే సమస్యకు గల కారణాలేంటో తెలుసుకున్నారు కదా! మరి మీకు కూడా ఆ సమయంలో ఇలాంటి సమస్య ఎదురైతే అనవసరంగా కంగారు పడకుండా.. ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.. ఏమంటారు??
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం