- కొందరిలో పొట్ట, తొడల వద్ద పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి హిప్‌రోలింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూర్చొని చేసే ఆసనం. చిత్రంలో చూపిన విధంగా మోకాళ్లను మడిచి, చేతులను వెనక్కి జరిపి అరచేతులను నేలపై పెట్టి కూర్చోవాలి. మోకాళ్లు, పాదాలు దగ్గరగా పెట్టాలి. తుంటిభాగంపై భారం వేస్తూ పాదాలను పైకి లేపాలి. ఇప్పుడు వెనుకభాగాన్ని ఎడమవైపు ఒకసారి, కుడివైపు మరోసారి తిప్పాలి. అలా తిప్పుతూ ఉండాలి. ఇలా కనీసం 50 సార్లు చేయాలి. ఇలా చేస్తే తొడలు, నడుము, పొట్ట భాగాల్లో ఉన్న కొవ్వు త్వరగా కరుగుతుంది. శరీరం చక్కటి ఆకృతిలోకి వస్తుంది. ఇలా చేస్తున్నప్పుడు కొంచెం ముందుకు జరిగే అవకాశం ఉంది. అప్పుడు చేతులను కూడా ముందుకు జరుపుతూ చేయొచ్చు. లేదా చేతుల సాయంతో అక్కడే ఉండి కూడా చేయొచ్చు. నడుము నొప్పితో బాధపడేవాళ్లు ఈ ఆసనం వేయకూడదు.
- కాళ్లు కొంచెం దూరంగా పెట్టి, చేతులను ముందుకు చాచి చిత్రంలో మాదిరి ఉంచాలి. ఇప్పడు మెల్లగా మోకాళ్లు వంచి తుంటిభాగం వీలైనంత వెనక్కి ఉండేలా కింద కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ మెల్లిగా పైకి లేవాలి. మళ్లీ కూర్చోవాలి. ఇలా చేస్తున్నప్పుడు మోకాళ్లు కాలి వేళ్లు సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఇలా 20 సార్లు చేయాలి. దీంతో నడుము కింది (తుంటి)భాగం, తొడల్లో కొవ్వు చాలా త్వరగా తగ్గిపోతుంది.
- మొదట మోకాళ్లు మ్యాట్‌పై ఆనించాలి. ఇప్పుడు చేతులను తొంభై డిగ్రీల కోణంలో ఉండేలా నిలువుగా పెట్టాలి. మెల్లగా శ్వాస వదులుతూ కుడి మోకాలిని ముందుకు తీసుకెళ్లాలి. తలను కిందికి పెట్టాలి. మోకాలిని నుదురు లేదా గడ్డానికి ఆనించేందుకు ప్రయత్నించండి. అలాగే శ్వాస తీసుకుంటూ కాళ్లను వెనక్కి పెట్టాలి. ఇలా కుడికాలితో 10 సార్లు, ఎడమకాలితో 10 సార్లు చేయాలి. దీనివల్ల తుంటిభాగంలో కొవ్వు కరిగి చక్కటి ఆకృతి వస్తుంది.
పై స్థితిలోనే ఉంటూ మెల్లిగా మొదట కుడికాలిని పూర్తిగా చాపాలి. ఎడమకాలిని మడవాలి. కాసేపటి తర్వాత రెండో కాలితోనూ ఇలానే చేయాలి. ఇలా చేస్తే తొడల దగ్గర కొవ్వు కరుగుతుంది.