మర్దన
శరీరానికి, తలకి హెర్బల్ నూనెతో మర్దన చేయండి. ఇది ఒత్తిడిని అదుపులో ఉంచుతుంది. చర్మమూ నవయౌవన కాంతితో నిగనిగలాడుతుంది. కప్పు బాదం నూనెలో ఐదారు చుక్కల లావెండర్ నూనె కలిపి రాయండి. ఫలితం ఉంటుంది.
స్క్రబ్
పని ఒత్తిడిలో పట్టించుకోం గానీ మృతకణాలు పేరుకుని చర్మాన్ని నిర్జీవంగా మార్చేస్తాయి. అందుకేే వీలు దొరికినప్పుడు శరీరం మొత్తానికి అంటే వీపు, మెడా, కాళ్లకు కూడా స్క్రబ్బింగ్ చేస్తే మంచిది. దీనికోసం రోజ్బాత్ సాల్ట్ లేదా హెర్బల్ డీప్క్లెన్సింగ్ మిల్క్‌ని ఉపయోగించొచ్చు.
అలాకాదు అనుకుంటే.. స్క్రబ్‌ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పావుకప్పు గులాబీరేకుల ముద్దలో చెంచా తేనె, పావుకప్పు పాలు, రెండు చెంచాల ఉలవపిండి కాస్త పంచదార చేర్చి మెత్తగా చేసుకోవాలి. దీన్ని ఒంటికి పట్టించి నలుగు పెట్టాలి. అప్పుడే శరీరంపై మురికితో మూసుకుపోయిన చర్మరంధ్రాలు తెరుచుకుని శుభ్రపడతాయి. ఫలితంగా యాక్నె, మొటిమలు లాంటి సమస్యలు తలెత్తవు.
ఫేషియల్
ప్రతివారం అవసరం లేదు కానీ నెలకు ఒక్కసారి ఫేషియల్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా మన చర్మం రంగు మారుతూ ఉంటుంది. ముఖంలో ఉన్న టాన్ పోయేలా చక్కటి ఫేస్‌ప్యాక్ వేసుకోండి. ఇందుకోసం తాజా పళ్లను ఉపయోగించండి. బొప్పాయి గుజ్జుకి చెంచా సెనగపిండి రెండు చుక్కల రోజ్ ఆయిల్ కలిపి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాలయ్యాక కడిగేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.
ట్రిమ్మింగ్
జుట్టుకి అతిగా నూనె పట్టినా, సరిగా దువ్వకపోయినా.. తరచూ తలస్నానాలు చేసినా కూడా నిర్డీవంగా కనిపిస్తుంది. మార్కెట్లో హెర్బల్ స్పా ఉత్పత్తులు చాలానే ఉన్నాయి. వాటిని వాడొచ్చు లేదంటే చక్కగా గోరువెచ్చని నూనె మర్దనా చేయాలి. ఆపై కోడిగుడ్లలోని తెల్లసొన, పెరగు, నిమ్మరసం బాగా గిలకొట్టి తలకు పట్టించి షవర్‌క్యాప్ పెట్టేయాలి. తర్వాత గోరు వెచ్చని నీళ్లతో గాఢత తక్కువ ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. అలానే చిట్లిన వెంట్రుకలను ట్రిమ్ చేయడం మంచిది. అప్పుడే కొత్త కళతో కనిపిస్తారు.