మయోపియా... పిల్లల్లో ఎక్కువగా వచ్చే దృష్టిలోపం. దీనివల్ల వాళ్లకు దూరం వస్తువులు సరిగ్గా కనిపించవు. పిల్లలతోపాటు కౌమార దశలో ఉన్నవాళ్లలో ఈ లోపం ఎక్కువగా ఉంటుంది. టీవీ, ఫోన్లూ ఎక్కువగా చూడటం వల్లే వాళ్లలో ఈ రకమైన దృష్టిలోపం ఏర్పడుతుందని ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే మయోపియాకీ నిద్రలేమికీ కూడా సంబంధం ఉంది అంటున్నారు ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయ నిపుణులు.
ఈ విషయమై వీళ్లు ఇరవై ఏళ్లు దాటిన విద్యార్థుల్ని ఎంపికచేసి మయోపియా ఉన్నవాళ్లనీ లేనివాళ్లనీ వేరు చేసి పరిశీలించారట. అందులో ఎలాంటి దృష్టి దోషాలూ లేనివాళ్లతో పోలిస్తే మయోపియా ఉన్నవాళ్లలో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తి తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు, మిగిలినవాళ్లకన్నా వీళ్ల నిద్రావేళలు కూడా సరిగ్గా లేవని తెలిసింది. దీన్నిబట్టి నిద్రలేమి అనేది కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు, కంటి ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తుంది అంటున్నారు. చిన్నప్పటి నుంచీ పిల్లలకు డిజిటల్ వస్తువుల్ని అలవాటు చేయడం వల్లే వాళ్లలో నిద్రపోయే సమయం తగ్గిపోయి, అనేక సమస్యలకు కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు.