మొటిమలు మాయం...
తమలపాకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. రెండు మూడు తమలపాకులను తీసుకుని మెత్తగా చేయండి. అందులో చిటికెడు పసుపూ, తేనె కలిపి ముఖానికి రాసుకోండి. ఆరాక చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లైనా చేస్తే మొటిమలు తగ్గి, చర్మం మృదువుగా మారుతుంది.
చర్మం తాజాగా...
తమలపాకుల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అరలీటరు నీళ్లలో గుప్పెడు తమలపాకులను వేసి బాగా మరిగించండి. ఆపై వడకట్టి... దానిలో చెంచా చొప్పున తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరాక కడిగేస్తే చాలు. చర్మానికి తేమ అంది తాజాగా కనిపిస్తుంది.
చెమట వాసన ఉండదు...
కొంతమందికి చెమట ఎక్కువగా పడుతుంది. అలాంటి వారు స్నానం చేసే నీళ్లల్లో కొన్ని చుక్కల తమలపాకుల నూనె కలిపి చేయాలి. అలాగే ఈ నూనెలో కర్పూరం వేసి కరగనివ్వాలి. ఆపై ఇందులో దూది ఉండను ముంచి దాంతో ముఖాన్ని తుడిస్తే సరి. చర్మం శుభ్రపడుతుంది.
జుట్టు రాలదు
ఇటీవల కాలంలో జుట్టు రాలడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆయుర్వేద వైద్యం ప్రకారం తమలపాకులు జుట్టు రాలే సమస్యను నిరోధిస్తాయి. నువ్వుల నూనెలో కొన్ని తమలపాకులు వేసి మరిగించాలి. అది గోరువెచ్చగా అయ్యాక ఆ మిశ్రమాన్ని తలకు రాసుకుని మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే ఫలితం ఉంటుంది.
ఇదీ చూడండి : పచ్చదనంతో నిండిన అనంతగిరి కొండలు..