కూతురును కొద్ది రోజుల కిందటే అత్తవారింటికి సాగనంపారు. తమ బాధ్యత తీరిందని ఆ తల్లిదండ్రులు సంతోషంలో ఉన్నారు. అంతలోనే అల్లుడి కుల వివాదం వీరి మధ్య చిచ్చు రేపింది. పచ్చని తోరణాలు ఆ ఇంటి ముందు వాడక ముందే.. పెళ్లి కళ వీడక ముందే వధువు తల్లి తన భర్తనే హత్య చేసి కటకటాలపాలైంది. సమాజం ముందు నిందితురాలిగా మిగిలిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం గురంధరపాలెంలో వ్యవసాయ కూలీ విసారపు చిరంజీవి హత్యకేసులో అతని భార్య సన్యాసమ్మ వీఆర్వో రాజేశ్వరి ముందు లొంగిపోయింది. డీఎస్పీ శ్రీనివాసరావు ఈ ఘటన వివరాలను వెల్లడించారు.
కులం రేపిన చిచ్చు
విసారపు చిరంజీవి సన్యాసమ్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. పెద్దమ్మాయికి ఐదేళ్ల క్రితమే వివాహం చేశారు. చిన్నమ్మాయిని ఈనెల 3న మాకవరపాలెం మండలం పైడిపాలకు చెందిన అడ్డూరి చంటబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహమైన నాలుగు రోజుల తర్వాత అతను వేరే కులానికి చెందిన వాడని వీరికి తెలిసింది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతోంది. ఈనెల 11న ఆడపడుచు కొండపల్లి పార్వతి ఇంటివద్ద పెద్దలతో పంచాయితీ జరిగింది. కుల ధ్రువీకరణ పత్రం కోసం అల్లుడి కుటుంబసభ్యులను డిమాండ్ చేసినా చూపలేకపోయారు. దీంతో తమ పరువు పోయిందని భార్యాభర్తలు ఆందోళన చెందుతున్నారు.
ఇలా చంపేసింది
ఈనెల 15న మూడు గంటలకు భార్య సన్యాసమ్మ కత్తి తీసుకొని పొలంలోని పాకవద్దకు వెళ్లింది. అక్కడ ఇద్దరూ ఘర్షణపడ్డారు. కత్తితో భర్తపై దాడి చేయడం వల్ల ఆయన మరణించారు. కత్తిని అక్కడే పడేసి, రక్తపు మరకలను శుభ్రం చేసుకుని ఇంటికి వెళ్లిపోయింది. తన భర్త హత్యకు గురైనట్టు తొలుత ఫిర్యాదు చేసినా ఇప్పుడు లొంగిపోయిందని డీఎస్పీ వివరించారు. ఆమెను అరెస్టు చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండి: తెలంగాణ: మత్యుబావిలో 9 మృతదేహాలు... హత్యా... ఆత్మహత్యలా?