జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం పెద్ద నక్కలపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.
మామిడి సిద్ధార్థ, కార్తీక్‌లు బుధవారం మధ్యాహ్నం బహిర్భూమికని వెళ్లారు. రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. స్థానిక బోధరి గూడెం చెరువు వద్ద చెప్పులు, దుస్తులు కనిపించాయి. అనుమానంతో చెరువులో వెతకగా.. ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఫలితంగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన కార్తీక్ 3 రోజుల క్రితం తన తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. తన మేనమామ కుమారుడైన సిద్ధార్థతో కలిసి బహిర్భూమికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.