బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంలలో నగదు నింపకుండా మోసాలకు పాల్పడిన ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ ఏటీఎంలలో నగదు నింపేందుకు హిటాచీ పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు.. బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు కాంట్రాక్టు ఇచ్చారు. ఆ సంస్థ ... లాజిక్యాష్ సొల్యూషన్స్ అనే మరో సంస్థకు సబ్ కాంట్రాక్టు ఇచ్చింది. అందులో పనిచేస్తున్న సంజయ్ సింగ్, వెంకటేశ్ అక్రమాలకు పాల్పడ్డారు.
అబిడ్స్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి నగదు తీసుకెళ్లి అదే బ్యాంకు ఏటీఎంలలో నగదు నింపడం వీళ్ల పని. కానీ ఆ నగదులో కొంత మొత్తాన్ని సంజయ్ సింగ్, వెంకటేశ్ సొంత అవసరాలకు వాడుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా నకిలీ పత్రాలు సృష్టించారు. ఇలా ఏడాది కాలంలో రూ.4కోట్లు మోసానికి పాల్పడినట్లు లాజిక్యాష్ సంస్థ నిర్వాహకులు గుర్తించారు. వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... సంజయ్ సింగ్, వెంకటేశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రూ.10లక్షల నగదుతో పాటు... పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: అయ్యో పాపం.. ఎవరో పాపను వదిలేశారు..