హైదరాబాద్లోని సికింద్రాబాద్లో నాలుగు వందల ఏళ్ల చరిత్ర కలిగిన తుకారాంగేట్ పహాడి హనుమాన్ దేవాలయంలో చోరీకి విఫలయత్నం జరిగింది. డిసెంబరు 31న మధ్యరాత్రి రెండు గంటల సమయంలో ఓ దొంగ ఆలయంలోకి చొరబడ్డాడు. రెండు హుండీల తాళాలు పగలగొట్టి ఉన్నదంతా దోచుకున్నాడు.
శబ్దాలు గమనించి..
అయితే ఆలయంలో నుంచి వస్తున్న శబ్దాలును దగ్గర్లోని బోయబస్తీ యువకులు గమనించారు. పోలీసులకు ఫోన్ చేసి.. దాదాపు ముప్పై మంది యువకులు కర్రలు పట్టుకొని ఆలయాన్ని చుట్టుముట్టారు. బయట యువకుల్ని చూసిన దొంగ ఏం చేయాలో తోచక ఆలయ గర్భగుడిలోనే తలదాచుకున్నాడు.
గర్భగుడి వెనుక దాక్కొని..
ఆలయాన్ని చేరుకున్న పోలీసులు ప్రాంగణంలో దొంగ కోసం గాలించగా అతడు కనిపించలేదు. దొంగ గుడిలోనే ఉన్నాడని బస్తీయువకులు పోలీసులకు చెప్పగా.. గుడి లోపలికి వెళ్లి గాలించారు. గర్భగుడి వెనుక దాక్కొని ఉన్న దొంగను ఎట్టకేలకు పట్టుకున్నారు. దొంగ తుకారాంగేట్కు చెందిన వ్యక్తిగా బస్తీవాసులు గుర్తించారు.
వారం రోజుల ముందే ఈఓకు ఫిర్యాదు చేశాం..
"తుకారాంగేట్లోని పహాడి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గతంలో అనేక సార్లు దొంగలు పడ్డారని, గుడికి భద్రత కల్పించాలని వారం రోజుల ముందే ఈఓకు ఫిర్యాదు చేశాం. ఆలయంలోని సీసీ పుటేజీలు పనిచేయడం లేదని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఆలయానికి రక్షణ కల్పించాలి"
-కలకంట్ల హరి. భాజపా గ్రేటర్ నాయకుడు
ఇదీ చూడండి: రాజస్థాన్లో కొత్త వైరస్- 100 కాకులు మృతి