ఖమ్మంలో పట్టపగలే దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. నగరం మధ్యలోని ఓ ఇంట్లో తుపాకితో గృహిణిని బెదిరించి మెడలోని మంగళసూత్రం దోచుకెళ్లాడు. రహమత్‌నగర్‌లో లావణ్య, సునిల్ రెడ్డి దంపతులు నివాసముంటున్నారు. వారికి ఒక 10నెలల పాప ఉంది. ముందు పోర్షన్‌లో లావణ్య, సునీల్ దంపతులు అద్దెకున్నారు. వెనుక పోర్షన్ ఖాళీగా ఉండటం వల్ల ఇంటి ముందు టులెట్ బోర్డు పెట్టారు.
మధ్యాహ్నం సమయంలో ఒక అగంతకుడు ఇల్లు అద్దెకు కావాలని అడుగుతూ లోపలికి వచ్చాడు. ఆకస్మాత్తుగా చంటి పాపను పట్టుకున్నాడు. అతని వద్ద ఉన్న తుపాకిని చూపించి గృహిణిని బెదిరించి మెడలోని మంగళసూత్రం దోచుకుని వెళ్లాడు. వెంటనే తేరుకుని స్థానికుల సాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే దొంగను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అపరిచిత వ్యక్తులను ఇంట్లోకి రానివ్వొద్దని విజ్ఞప్తి చేశారు. పెద్ద భవంతుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే భద్రతగా ఉంటుందని సూచిస్తున్నారు.