యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలో ఆస్తుల నమోదు సర్వేకు వెళ్తున్న పంచాయతీ జూనియర్ కార్యదర్శి గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన జక్కుల నరేందర్ (42) సమీపంలోని పారుపల్లిలో గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ధరణి సర్వే నిమిత్తం రోజు మాదిరిగానే ఉదయాన్నే ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మధ్యలో ఛాతి నొప్పి రావడం వల్ల వెంటనే నరేందర్ తన చరవాణి సాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు కారులో వచ్చి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తుండగా మరణించాడు. అందరితో కలుపుగోలుగా ఉండే నరేందర్ మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనితో పాటు పనిచేసే పంచాయతీ కార్యదర్శులు నల్లబ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు.
పని ఒత్తిడితోనే మృతి...
కొన్ని రోజులుగా ఉపాధి హామీ పథకం, ఆస్తుల నమోదు సర్వే, ఇతర పనుల వల్ల విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నామని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. పనులను తగ్గించాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శుల సంఘం నాయకులు డీపీఓ సాయిబాబాకు వినతిపత్రం అందించారు. పని ఒత్తిడి కారణంగానే నరేందర్ గుండెపోటుకు గురయ్యారని అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: నిమ్స్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది నిరసన