ప్రాణహాని ఉందనుకునేవారు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకొని ఆయుధ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మాత్రం ఆయా పోలీస్ కమిషనర్లకు లైసెన్స్ జారీ అధికారముంది. దరఖాస్తులో పేర్కొన్న ప్రకారం ప్రాణహాని ఉందా? అనే అంశాన్ని డీఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి నివేదిక సమర్పించాలి. అప్పుడే లైసెన్స్ జారీ అవుతుంది. గతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు పలువురికి ప్రాణహాని ఉండేది కాని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు చాలా తక్కువే.
2010లో జూబ్లీహిల్స్‌లో ఓ వైద్యుడు తన ఇంట్లో చోరీకి వచ్చిన దొంగను అడ్డగించేందుకు కాల్పులు జరిపి హతమార్చారు. ఇలాంటి ఒకట్రెండు సంఘటనల్లో మాత్రమే ఆత్మరక్షణకు ఆయుధం ఉపయోగపడిందని చెప్పొచ్చు. కాని అత్యధిక శాతం ఉదంతాల్లో ఆయుధాలు దుర్వినియోగమే అయ్యాయి. ప్రస్తుతం పలువురు సంపన్నులు ఆయుధాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా భావించి తమకున్న పలుకుబడితో లైసెన్స్‌లు పొందుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్సార్‌నగర్, మాదాపూర్.. లాంటి ప్రాంతాల్లోనే వీటి సంఖ్య ఎక్కువ ఉండటమే ఇందుకు నిదర్శనం.
లైసెన్స్ పొందితే...
ఒక్కసారి లైసెన్స్ పొందిన తర్వాత అరుదైన సందర్భాల్లో మాత్రమే దాన్ని రద్దు చేసే అవకాశముండటం లైసెన్స్‌దారులకు కలిసివస్తోంది. వాస్తవానికి మూడు నెలలకోమారు సంబంధిత ఎస్‌హెచ్‌వో లైసెన్స్‌లపై సమీక్షించాలి. ఈ ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారడాన్ని లైసెన్స్‌దారులు తమకు అనుకూలంగా మలుచుకొని ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయంలో ఎక్కుపెడుతున్నారు. సరైనరీతిలో సమీక్షలు నిర్వహిస్తే పలు లైసెన్స్‌లు రద్దయ్యే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
8,500 ఆయుధాలు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8,500 ఆయుధాలున్నాయి. గత సాధారణ ఎన్నికల సమయంలో తెలంగాణలో 8,482 ఆయుధాల్ని లైసెన్స్‌దారులు పోలీసుల వద్ద డిపాజిట్ చేశారు. వివిధ కారణాలతో 39 లైసెన్స్‌ల్ని రద్దు చేశారు. 11 అక్రమాయుధాల్ని గుర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో 5,075; రాచకొండ కమిషనరేట్‌లో 711; సైబరాబాద్ కమిషనరేట్‌లో దాదాపు వెయ్యి ఆయుధ లైసెన్స్‌లున్నాయి.
ఇవీ చూడండి: ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో కాల్పుల కలకలం