ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. మత్తుకు బానిసలైన కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలైన మారేడుమిల్లి, అడ్డతీగల, సీలేరు తదితర ప్రాంతాల నుంచి బస్తాల్లో గంజాయిని తీసుకువస్తుంటారు. అడవుల్లో పండిన పంటను కోసి ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని పొరపొరలుగా చేసి ప్యాకింగ్ చేస్తారు. వీటిని సూట్‌కేసుల్లో సర్ది, బాక్సుల్లో కడతారు. ఆ తర్వాత వాటిని బస్సులు, లారీల ద్వారా పార్శిల్ చేస్తారు. ప్రస్తుతం రైలు మార్గం సక్రమంగా లేకపోవడం వల్ల... ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ ఏజెన్సీ, ఖమ్మం జిల్లా అడవుల నుంచి జాతీయ రహదారిపై విజయవాడకు రవాణా అవుతోందని పోలీసులు చెబుతున్నారు.
అయితే గంజాయి ఘాటైన వాసన వస్తుంది. పోలీసులు దీన్ని సులభంగా గుర్తు పడతారు. దీంతో గంజాయి ముఠాలు... పకడ్బందీగా ప్యాకింగ్ చేస్తున్నాయి. గాలి చొరబడకుండా మందపాటి ప్లాస్టిక్ కవర్లలో కట్టి... సుగంధాన్ని వెదజల్లే అత్తరు, సెంటు, పౌడర్ పూసి సరఫరా చేస్తారు. గమ్యం చేరిన తరువాత ఈ బ్యాగ్‌ను విడదీసి కిలోల చొప్పున అమ్మేస్తారు.
యువత పెడదోవ..
తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించవచ్చనే దురాశతో... యువత పెడదోవ పడుతున్నారు. బయట నుంచి తెచ్చుకున్న గంజాయిని చిన్న పొట్లాలు కట్టి విక్రయిస్తున్నారు. ఒక పొట్లం రెండు సిగరెట్లలో కూర్చడానికి సరిపోతోంది. ఒక్కో పొట్లం ధర రూ. 50 వరకు ఉంటుంది. కిలో గంజాయిని విక్రయిస్తే 6 నుంచి 7వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది.
దీంతో నగరంలోని లెనిన్‌సెంటర్, ఏలూరు లాకులు సెంటరు, పశ్చిమ రైల్వే బుకింగ్ ప్రాంతం, ఎర్రకట్ట, వాంబేకాలనీ, న్యూ రాజరాజేశ్వరీపేట, రాణిగారితోట, సీతమ్మవారి పాదాలు, రామవరప్పాడు రైల్వేస్టేషన్, బస్టాండ్ పరిసరాలు, గాంధీనగర్, కొండపల్లి, కాళేశ్వరరావు మార్కెట్టు, లోబ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో విక్రయాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం పోలీసులమంటూ బెదిరించిన కేసులో నిందితునికి... దాదాపు రెండేళ్ల నుంచి గంజాయి తాగే అలవాటు ఉందని, సింగ్‌నగర్ ప్రాంతంలో ఓ మహిళ దగ్గర దాన్ని కొనుగోలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల ఉదాసీనత...
ఈ గంజాయి విక్రయాలు కొంతమంది పోలీసులకు తెలిసినప్పటికి చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కొందరు మామూళ్లు తీసుకోని వదిలేస్తే... మరికొందరు మనకెందుకులే అన్న భావంతో ఏమి ఎరగనట్టు నటిస్తున్నారు. పెద్ద మొత్తంలో దొరికినప్పుడు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్పితే.. అసలు నేరస్థులను పట్టుకోవడం శ్రద్ధ చూపడం లేదు. దీంతో నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌తో సహా... సింగ్‌నగర్, పాయకాపురం, సత్యనారాయణపురం పరిధిలో జరిగిన అనేక కొట్లాట కేసుల్లో నిందితులు గంజాయి సేవించే వారే కావడం గమనార్హం.
ఇవీ చూడండి: జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయండి: కమిషనర్