మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం (బి) గ్రామానికి చెందిన లావుఢ్య భద్రు కుటుంబానికి చారీ హరీష్ రూ.1.40 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వారు డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. ఘర్షణకు దిగి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై చారీ హరీశ్ సైతం గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో డబ్బులు ఎగ్గొట్టాలనే ఉద్యేశంతో లావుఢ్య భద్రు భార్య కాంతమ్మ తన ఫోన్ దొంగిలించావంటూ పలుమార్లు చారీ హరీశ్‌కు ఫోన్ చేసి దూషించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే పోలీసులు చారీ హరీష్‌ను స్టేషన్‌కు పిలిపించగా.. పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు.
![Suicide attempt by a disabled person for police harassment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-wgl-23-28-policela-veadhimpulatho-sucide-attempt-ab-ts10071_28092020214931_2809f_1601309971_116.jpg)
ఈనెల 24న రాత్రి పోలీసులు చారీ హరీష్‌కు ఫోన్ చేసి నీపై రౌడీ షీట్ నమోదు చేస్తున్నామని.. ఆధార్ కార్డు తీసుకోని రావాలని తెలిపారని చారీ హరీష్ పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి... మహబూబూబాద్కు వెళ్లాలంటూ తన సోదరి కుమారుడి ద్విచక్రవాహనంపై ఎక్కాడు. మార్గమధ్యలో పురుగుల మందు తాగినట్లు ఫోన్లో కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయంపై రూరల్ సీఐ వెంకటరత్నంను వివరణ కోరగా.. లావుఢ్య భద్రు భార్య ఫిర్యాదు మేరకు చారీ హరీష్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారించాం తప్ప.. ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదని స్పష్టం చేశారు. గతంలోనే ఇతడిపై 354 సెక్షన్ కింద కేసు నమోదైనట్లు వివరించారు.