నిర్మల్ జిల్లా భైంసా మండలం ఎగ్గం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫోన్ కోసం జరిగిన గొడవలో అక్క ప్రాణాలు తీసుకుంది. గ్రామానికి చెందిన వసంత(17) ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఇంటివద్దనే ఉంటూ ఆన్లైన్ తరగతులకు హాజరవుతోంది. ఈ సమయంలోనే తమ్ముడు చరవాణి కావాలంటూ అక్కతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత పురుగుల మందు తాగినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. బాలికకు రాత్రి వాంతులు కావడంతో భైంసాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక పరిస్థితి విషమించడంతో 12వ తేదీన నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక ఈరోజు ఉదయం మృతి చెందింది. బాలిక మృతదేహన్ని పోస్టుమార్టం కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పున్నం చందర్ తెలిపారు.