చెల్లని టర్కీ కరెన్సీ నోట్లను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలో మార్చేందుకు యత్నిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చెల్లని 300 టర్కీ కరెన్సీ నోట్లు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా ఏసీపీ ఆర్వీఎన్ఎన్ మూర్తి కేసు వివరాలను వెల్లడించారు.
విశాఖలోని కృష్ణా కళాశాల సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు వ్యక్తుల వద్ద 300 టర్కీ చెల్లని నోట్లను పోలీసులు గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఈ నోట్లను ఎక్కువ మొత్తాలకు అమాయకులకు అంటగట్టేందుకు ముఠా యత్నిస్తున్నట్టు పోలీసులు తెలుసుకున్నారు. బుజ్జల రామస్వామి, నాంబారి నారాయణరావు, దమ్మేటి సత్య వెంకట ప్రసాద్, దలాలి యశోద, ఇందిలా పృథ్వీరాజ్, మువ్వల ప్రసాద్‌లపై ఎంవీపీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కీలక సూత్రధారి పరారీలో ఉన్నట్టు ఏసీపీ మూర్తి వివరించారు.