మంచిర్యాల జిల్లాలో రేషన్ బియ్యం దందా మరోసారి భారీగా బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు లారీల బియ్యాన్ని పట్టపగలే పోలీసులు పట్టుకున్నారు. బియ్యం రవాణా ఏ స్థాయిలో కొనసాగుతుందో... ఈ ఘటనను చూస్తే అర్థమవుతోంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని రేపల్లెవాడ రాష్ట్రీయ రహదారిపై మూడు లారీల్లో తరలిస్తున్న 800 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తాండూరు ఎస్ఐ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు తరలిస్తున్నారన్న... పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఇటీవల జిల్లాలో రేషన్ బియ్యం పట్టుబడుతున్నప్పటికీ... దందా మాత్రం ఆగడం లేదు. అక్రమార్కులు ఎక్కడికక్కడ మామూళ్లు ఇచ్చుకుంటూ బియ్యం రవాణా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పట్టుకున్న మూడు లారీల్లో రెండు లారీలను వదిలేయాలని అక్రమార్కులు తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని బెల్లంపల్లి ఏసీపీ రహమాన్ పరిశీలించారు. రెండు లారీల డ్రైవర్లు తాళాలు వేసి పరారు కాగా... మరో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య