తమిళనాడులోని పల్లికరాణనై డంప్యార్డ్లో రోజూ పని చేసే మున్సిపల్ కార్మికులకు జనవరి 21న అనుకోని దృశ్యం కంటబడింది. చెత్త తొలగిస్తుండగా ఓ సంచి బయట పడింది. తెరిచి చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రక్తపు మరకలతో ఉన్న ఆ సంచిలో ఓ మహిళ రెండు కాళ్లు, చెయ్యి బయటపడ్డాయి. భయాందోళనలతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంచిని ముందుగా క్రొమోపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దారుణానికి కారకులైన వారిని పట్టుకోవడానికి వేట మొదలుపెట్టారు.
దర్యాప్తులో భాగంగా వల్లువర్ కొట్టమ్ ప్రాంతం నుంచి సంచి డంప్యార్డుకు చేరుకుందని పోలీసులు కనిపెట్టారు. కోత యంత్రాలతో శరీర భాగాలను కోసి పలు ప్రాంతాల్లో పారేసినట్టు గుర్తించారు. శరీర భాగాలకు వైద్యులు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ వార్త తమిళనాడుని కుదిపేసింది.
తవ్వుకున్న గోతిలోనే...
దర్యాప్తు కొనసాగుతుండగానే... పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన జాఫర్ ఖాన్పేట్ వాసి బాలకృష్ణన్... తన భార్య సౌందర్య అదృశ్యమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలకృష్ణన్ వ్యవహారం అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు అతడిపై నిఘా పెట్టారు.
చిక్కాడిలా...
ఏ చిత్రంలోనైనా అంతిమ విజయం హీరోదే... ఎన్ని రోజులకైనా నిజం బయటపడాల్సిందే. పోలీసుల నిఘాలో బాలకృష్ణనే భార్యను కిరాతకంగా చంపి నగరంలోని వివిధ ప్రదేశాల్లో శరీర భాగాలు పడేశాడని ధ్రువీకరించారు.
భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్నది బాలకృష్ణన్ అనుమానం. ఆ కారణంతో సౌందర్యతో తరచూ గొడవవడుతూ ఉండేవాడు. వ్యవహారం ముదిరి విడాకుల వరకు వెళ్లింది. కక్ష పెరిగి ఉన్మాదంగా మారి చివరికి బాలకృష్ణన్ సౌందర్యను అతి కిరాతకంగా చంపాడు.