పెద్దపల్లి జిల్లా రామగిరి పరిధిలోని సెంటినరీ కాలనీకి చెందిన మాలోతు మణికంఠ అనే యువకుడు వృత్తిరీత్యా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి గంజాయి తీసుకునే అలవాటు ఉంది. డ్రైవింగ్తో పాటు.. గంజాయి అమ్మడం కూడా మొదలు పెట్టాడు. రామగిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, రామగిరి, పన్నూరు, సెంటినరీ కాలనీ ప్రాంతాల్లో గంజాయి అమ్మేవాడు. అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ నుంచి గంజాయి కొనుగోలు చేసి రామగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి అమ్మేవాడని పెద్దపల్లి డీసీపీ రవీందర్ తెలిపారు.
ఈ మేరకు ఆయన రామగిరి పోలీస్ స్టేషన్లో మంథని సీఐ మహేందర్, రామగిరి ఎస్సై మహేందర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తల్లిదండ్రులు నిత్యం తమ బిడ్డలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని.. మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారేమో గమనిస్తూ ఉండాలని డీసీపీ సూచించారు. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పోలీసులు పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ గంజాయి అమ్ముతూ.. పలువురు పట్టుబడటం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.