ఆన్‌లైన్ రుణ యాప్‌లపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నా... వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. యాప్ నిర్వాహకుల వేధింపులతో ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు బలవ్వగా...మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామానికి చెందిన చంద్రమోహన్, కుటుంబంతో సహా జీవనోపాధి కోసం 2006లో నగరానికి వలస వచ్చారు. భార్య,ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. చంద్రమోహన్ సూపర్‌మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా, భార్య ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. చంద్రమోహన్ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లించేందుకు మరో యాప్‌లో రుణం తీసుకున్నాడు. రుణ భారం పెరగడం వల్ల తన వద్ద ఉన్న క్రెడిట్ కార్డులను వాడి డబ్బు కట్టాడు. క్యాష్‌వ్యూ, క్యాష్‌పే, మైక్యాష్, క్యాష్ పాయింట్ సహా మొత్తం 9 యాప్‌లలో సుమారు లక్ష రూపాయల వరకు రుణాలు పొందాడు. తిరిగి చెల్లించడంలో ఆలస్యం కావడంతో యాప్ నిర్వాహకులు వేధింపులు మొదలుపెట్టారు. వారి వేధింపులు తాళలేక చంద్రమోహన్ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కఠిన చర్యలకు డిమాండ్
భార్య, కుటుంబసభ్యులు సహా ఇంటి ఓనరుకు ఫోన్లు చేసి అప్పు చెల్లించాలని వేధించడంతో తీవ్ర ఒత్తిడికి గురైన చంద్రమోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో ముగ్గురు కుమార్తెలను వాళ్ల భార్య అమ్మ,నాన్నల వద్ద వదిలేసి ఉరివేసుకున్నాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లోన్ యాప్ నిర్వాహకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రుణయాప్‌ల వాళ్లు వేధిస్తే తమకు సమాచారం అందించాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: దా'రుణ' యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య