హైదరాబాద్ బొల్లారంలో నివాసముంటున్న అరుణ్ కుమార్ అనే వ్యక్తి కడుపు నొప్పితో జూన్ 6న సికింద్రాబాద్ ఓల్డ్ అల్వాల్‌లోని ఎక్సెల్ ఆసుపత్రిలో చేరాడు. అతణ్ని పరీక్షించిన అనంతరం కడుపులో చిన్న గడ్డ ఏర్పడిందని వైద్యులు నిర్ధారించారు. సర్జరీ చేసి కడుపులోని గడ్డను తొలగించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక ఈనెల 11న అరుణ్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
రెండ్రోజుల క్రితం అరుణ్ కడుపులో నుంచి రక్తస్రావం కావడం వల్ల ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మళ్లీ వైద్యులను సంప్రదించారు. హిమాయత్ననగర్లోని బ్రాంచ్ ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు సూచించగా.. అక్కడికి వెళ్లారు. హిమాయత్‌నగర్ ఎక్సెల్ ఆసుపత్రి వైద్యులు అరుణ్‌ను మరోసారి పరీక్షించి, కడుపులో నీరు చేరిందని, మరో సర్జరీ చేశారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి కోమాలోకి వెళ్లిన అరుణ్.. ఈనెల 13న మృతి చెందాడు.
ఓల్డ్ అల్వాల్‌లోని ఎక్సెల్ ఆసుపత్రి వైద్యులు చేసిన శస్త్ర చికిత్స విఫలం చెందడం వల్లే అరుణ్ మరణించాడని, అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యులపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.