సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో బ్యాంకు నుంచి నగదు తీసుకుందామంటే రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పటాన్ చెరు ఠాణా పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు శాంతినగర్ కాలనీకి చెందిన ప్రణీత్ రెడ్డి గతంలో విప్రో సంస్థలో పనిచేసేవాడు. లాక్ డౌన్ మూలంగా ఉద్యోగం పోవడం వల్ల కొంతకాలంగా ఇంటివద్దే ఉంటున్నాడు. వారికున్న భూమి అమ్మి బ్యాంకులో డిపాజిట్ చేశారు.
డబ్బు తీసుకుందామని రెండురోజుల నుంచి ప్రయత్నించినా.. రావడం లేదని మనస్తాపం చెందాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చీరతో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. బలవన్మరణానికి ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.