కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మంచినీటి పథకం పనుల్లో భాగంగా నల్లా విడిభాగాలను దొంగలించి సొమ్ము చేసుకుంటున్న ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని.. వారందరు భూమి తవ్వడం, పునాదులు తీయడం, కేబుల్ లాగడం, నల్లాలు వేయడం లాంటి మట్టిపనులు చేసేవారని వరంగల్ సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డీసీపీ పుష్ప తెలిపారు. నిందితుల్లో ప్రధాన నిందితుడైన బోంత విజయ్ కుమార్ వరంగల్‌లో చేపట్టిన మిషన్ అమృత్ మంచినీటి పథకానికి సంబంధించిన పనిలో చేరాడని పేర్కొన్నారు.
ఆ సమయంలో నిందితుడు విజయ్ కరీంనగర్లో ఉంటున్న తన ముఠా సభ్యులు మిగితా ఆరుగురితో కలిసి కడిపికొండ శివారు ప్రాంతంలోని మిషన్ అమృత్ మంచినీటి పథకం సామగ్రి స్టాక్లోనికి చొరబడి సుమారు 8,248 ఇత్తడి కప్లర్ సెట్లను దొంగలించారన్నారు. కాగా శుక్రవారం రోజు చోరీ సొత్తుని అమ్మి సొమ్ముచేసుకుంటున్న సమయంలో వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు డీసీపీ పుష్ప తెలిపారు. నిందితులు బోంత విజయ్, కొమ్మరాజుల రాజు, బత్తుల రమేష్, శివరాత్రి శ్రీకాంత్, శివరాత్రి రమేష్, మరో ఇద్దరు నిందితులు ఓర్పు రాకేశ్, శివరాత్రి రాజులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 16 గోనేసంచుల్లో భద్రపర్చిన కప్లర్ సెట్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
ఇదీ చూడండి: 'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'