గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేమవరానికి చెందిన కొండపాటి గోపికి అదే గ్రామానికి చెందిన షేక్ రహమున్నీసాతో రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. కొంత కాలానికి ఒక బాబు పుట్టాడు. ప్రస్తుతం రహమున్నీసా వాలంటీర్‌గా పని చేస్తోంది. గోపి కూలీ పనులు చేస్తుంటాడు. కొద్ది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటినుంచి రహమున్నీసా గోపికి దూరంగా ఉంటోంది. తాడికొండ మండలం బందారుపల్లి వద్ద జరుగుతున్న రైల్వే ట్రాక్ పనుల కోసం మంగళవారం గోపి అక్కడకు వెళ్లాడు.
కాసేపు పని చేశాక.. తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. అది గమనించిన తోటి కార్మికులు గోపిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గోపి మృతి చెందాడు. తాను ఆత్మహత్య చేసుకోవటానికి భార్య రహమున్నీసా, అత్తామామలు, సాయి అనే వ్యక్తి కారణమని సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.