పొలంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు. గత నెలలోనే సమీపంలోని మన్యంకొండ గుట్టల్లో చిరుత సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పట్టణానికి చెందిన రాంపండు అనే రైతు ఎప్పటిలాగే పొలం వద్ద ఆవును, ఏడాది వయసున్న దూడను కట్టేసి ఇంటికి వచ్చాడు.
ఉదయం పొలం దగ్గరకు వెళ్లగానే.. ఆవుదూడ వెనుకభాగంలో చిరుత దాడి చేయడంతో అవయవాలన్నీ బయటపడి మృతి చెందినట్లు గమనించాడు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారిణి మోనిషా ఆవు దూడకు గాయాలైన తీరును పరిశీలించారు. చిరుత దాడిలోనే మృతి చెందినట్లు ఆమె ధ్రువీకరించారు. రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.