కామారెడ్డి శివారులోని బీడీవర్కర్స్ కాలనీలో జరిగిన జంట హత్యల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా... హత్య చేసింది తానేనని అంగీకరించాడు. బెజ్జంకి విగ్నేష్ అనే 19 ఏళ్ల యువకుడు జల్సాలకు, తాగుడుకు బానిసయ్యాడు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో యూట్యూబ్‌లో ఏటీఎం దొంగతనాలు ఎలా చేయాలో వీడియోలు చూసి ప్రయత్నించి... విఫలమయ్యాడు. వేరే దారి వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో విగ్నేష్ మెడికల్ దుకాణంలో వర్కర్‌గా చేరాడు. అప్పుడే ఆర్ఎంపీ డాక్టర్‌గా పనిచేస్తున్న వడ్ల సుధాకర్‌తో పరిచయం ఏర్పడింది. తనకు చాలా ఇబ్బందులున్నాయని, బంగారు గొలుసు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇప్పించాలని కోరాడు. అంగీకరించిన సుధాకర్ డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం... చైన్ తీసుకొని విగ్నేష్ వచ్చాడు. సుధాకర్ తన స్నేహితుడు లక్ష్మయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చాడు. ముగ్గురు కలిసి మద్యం సేవించేందుకు కూర్చున్నారు.
రోల్డ్ గోల్డ్ చైన్‌ను పసిగట్టిన సుధాకర్ డబ్బులు ఇవ్వనని చెప్పాడు. డబ్బులు రావన్న కోపంతో... అప్పటికే తన వెంట తెచ్చుకున్న గొడ్డలితో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. అడ్డు వచ్చిన లక్ష్మయ్యపై దాడి చేయగా... అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పరుగులు తీస్తున్న సుధాకర్‌ను వెంటాడి అతి కిరాతకంగా నరికి చంపాడు. సుధాకర్ వద్దనున్న రూ.2,500, లక్ష్మయ్య దగ్గరున్న రూ.120లు తీసుకొని పారిపోయాడు. ఈ హత్యలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్త హత్య