కరోనా లక్షణాలతో 20 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడు చివరికి శనివారం అదే ఆసుపత్రి మార్చురీలో అనాథ శవంగా తేలాడు. తమ బిడ్డ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మంగళ్‌హాట్‌కు చెందిన ఓ యువకుడు(35) తీవ్ర అనారోగ్యంతో గత నెల 30న ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలున్నాయంటూ కింగ్‌కోఠి ఆసుపత్రికి... అక్కడి నుంచి అదే రోజు రాత్రి గాంధీ ఆసుపత్రికి తరలించారు వైద్యులు. గాంధీలో చేర్పించిన తర్వాత పూర్తిభరోసాతో కుటుంబ సభ్యులందరూ తిరిగి ఇంటికి వచ్చారు. 31న ఉదయం అతని తల్లి, సోదరుడు బాధితునితో ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. గాంధీ ఆసుపత్రికి వెళ్లి వాకబు చేశారు. అసలు ఆ పేరుతో ఎవరూ తమ ఆసుపత్రిలో చేరనేలేదని వైద్యులు సమాధానమివ్వడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు
గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ తప్పు జరిగినట్లు పోలీసులు తేల్చారు. గాంధీలో చికిత్స తీసుకుంటూ గత నెల 31నే యువకుడు మృతి చెందారు. అతని వివరాలు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తి అంటూ అతని వయసు 35కు బదులు 65గా నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ప్రత్యేక శవపేటికలో పెట్టి గాంధీ మార్చురీకి తరలించి చేతులు దులుపుకొన్నారు. ఎట్టకేలకు పోలీసులు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. కొవిడ్ నిబంధనలతో రాత్రి 7గంటలకు పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు స్పందించారు. మృతుడు అసలు కొవిడ్ పేషెంట్ కాదన్నారు. గత నెల 30న ఆసుపత్రికి వచినట్లు రికార్డులో ఉందన్నారు. మెడికో లీగల్ కేసుగా తాము నమోదు చేశామని.. పోలీసులే గుర్తుతెలియని మృతదేహంగా మార్చురీకి తరలించారన్నారు.
పోలీసులను ఆశ్రయించడంతో..
ఈ విషయమై బాధితుడి తల్లి స్థానిక మంగళ్‌హాట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న కేసు నమోదు చేసిన పోలీసులు ఉస్మానియా, కింగ్‌కోఠి, గాంధీ ఆసుపత్రుల్లో వాకబు చేసినా ఫలితం లేకపోయింది. స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంబీటీ అధినేత అమ్జదుల్లాఖాన్ ఈ విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమ మండలం ఇన్‌ఛార్జి డీసీపీ ఏఆర్ శ్రీనివాస్‌రావు, గోషామహల్ ఏసీపీ నరేందర్‌రెడ్డి పూర్తిస్థాయిలో విచారించారు. శనివారం మధ్యాహ్నం ఎస్సై శివానందం ఆధ్వర్యంలో కరోనా మృతదేహాలనుంచే మార్చురీతో పాటు అనాథ మృతదేహాలను ఉంచే చోటును యువకుడి కుటుంబ సభ్యులతో వెళ్లి పరిశీలించారు. ఎట్టకేలకు గాంధీ అనాథల మార్చురీలో సదరు యువకుడి మృతదేహం లభ్యమైంది.
ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్ రిలీజ్- ఒక్కో టాబ్లెట్ రూ.103