ఏపీ విశాఖలో ద్వారకా బస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సీతమ్మధార ప్రాంతానికి చెందిన గూడాల అప్పల నాయుడు క్యాబ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భిక్షాటన చేసే కొందరితో అప్పల నాయుడికి చాలా కాలం నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యాచకుల్లో ఓ మహిళ నుంచి అప్పుడప్పుడు అప్పలనాయుడు డబ్బు తీసుకునేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే బిక్షాటన చేసే అనురాధ నుంచి రూ. 4 వేలు తీసుకున్నాడు.
తోటి యాచకులకు చెప్పడం వల్లే..
సదరు విషయాన్ని అనురాధ తోటి యాచకులకు చెప్పింది. అప్పలనాయుడు.. కాంప్లెక్స్‌లోని ఓ ఫుట్‌పాత్‌పై సోమవారం రాత్రి నిద్రిస్తున్నాడనే సమాచారంతో అనురాధతో పాటు దాసు, అబ్బులు, వెంకటరెడ్డి అక్కడికి వెళ్లారు. అనురాధ నుంచి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా వారు డిమాండ్ చేశారు. అప్పల నాయుడు నుంచి సరైన సమాధానం రాకపోవడం వల్ల ఆవేశంతో సిమెంట్ ఇటుకతో అప్పల నాయుడు తలపై బలంగా కొట్టారు. అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
కేజీహెచ్‌కు తరలింపు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అప్పలనాయుడు ప్రాణాలు కోల్పోయాడు. తీసుకున్న డబ్బు ఇవ్వనందుకు తామే హత్య చేసినట్లు నిందితులు పోలీసులకు చెప్పారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: పంట దక్కక.. అప్పు తీర్చలేక.. యువ రైతులు బలవన్మరణం