కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణహత్యకు గురయ్యారు. సోమలవారిపల్లి పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఇళ్ల స్థలాల ప్లాట్ల వద్ద దుండగులు కిరాతకంగా నరికి చంపారు. మారణాయుధాలతో దాడి చేసి.. సుబ్బయ్య తల ఛిద్రం చేశారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
విమర్శలు చేశారని
తెదేపా జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన సుబ్బయ్య రాజకీయంగా విమర్శలు చేస్తూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అనంతరం ప్రత్యర్థి పార్టీ శ్రేణులు ప్రతి విమర్శలు చేశారు. నాలుగైదు రోజుల నుంచి ఈ వివాదం జరుగుతోంది. మంగళవారం ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బయ్య.. వైకాపా శ్రేణులపై అరిచాడు. అనంతరం దుండగులు సుబ్బయ్యను నరికి హత్య చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరగడం కలకలం రేపుతోంది. రాజకీయ కోణంలోనే ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్షల కోసం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కక్షతో సబ్బయ్యను హతమార్చారు..
ప్రొద్దుటూరులో తెదేపా నాయకుడు సుబ్బయ్య హత్యను తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. చేనేత కుటుంబానికి చెందిన సుబ్బయ్య హత్య కిరాతక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా, క్రికెట్ బెట్టింగ్‌లో వైకాపా ఎమ్మెల్యే, ఆయన బావమరిది పాత్రను బహిర్గతం చేశారన్న కక్షతో సుబ్బయ్యను హతమార్చారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వద్దకు వెళ్లిన తెదేపా నాయకుడిని హత్య చేయించడం సీఎం జగన్కు సిగ్గుచేటన్నారు. గత 19నెలల్లో రాష్ట్రంలో అనేకమంది తెదేపా నాయకులు, కార్యకర్తలను బలిగొన్నారన్నారు. హంతకులను కఠినంగా శిక్షించి సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
తెదేపా నేతల నిరసన
సుబ్బయ్యను హత్యచేసిన నిందితులను అరెస్టు చేయాలని కడపలో తెదేపా నేతలు డిమాండ్ చేశారు. వైకాపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: 2020 రౌండప్: బండి జోరు.. భాజపా విజయాల హోరు