ప్రియుడు ఇంటి ముందు ప్రేయసి నిరసన వారిద్దరు బాల్యమిత్రులు. ఒకే ఊరు, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. కొన్నాళ్లకు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలో ప్రియుడు ముఖం చాటేశాడు. న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన ఓ అమ్మాయి, మోహన్‌కుమార్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకుని ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. ప్రేమించిన అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి.. తనని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు ప్రియుడు.
పెళ్లి చేస్తామని చెప్పి.. మోహన్ తరఫు బంధువులు కూడా పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ప్రియుడు ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా... వారు ఇరు వర్గాల బంధువులను పిలిపించి ఒప్పించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆరు నెలలుగా ప్రియుడి ఇల్లు తాళం వేసి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంటి ముందు బైఠాయించి.. చివరకు ఏం చేయాలో పాలుపోక ప్రేమించిన అబ్బాయి ఇంటి ఎదుట నాలుగు రోజులుగా న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తోంది. తమ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని... అబ్బాయి తరఫు బంధువులు వివాహానికి అడ్డుపడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను ప్రేమించిన బాల్య స్నేహితుడితో వివాహం జరిపించాలని కోరుతోంది.
ఇవీ చూడండి:'సంగారెడ్డి రసాయన వ్యర్థాల గోదాంలో అగ్నిప్రమాదం'