చిత్తూరు జిల్లా కురబలకోట మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బంధువుల పెళ్లికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన చిన్నారి హత్యకు గురవడం.. తీరని విషాదం నింపింది. బి.కొత్తకోట మండలం గుట్టపాలేనికి చెందిన రైతు సిద్ధారెడ్డి.. బంధువుల పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో కలిసి కురబలకోట వచ్చారు. అందరూ పెళ్లి మండపంలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు సిద్ధారెడ్డి కుమార్తె వర్షిణిని అపహరించారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. కాసేపటికి కూతురు కనిపించడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు.. వెదుకులాట ప్రారంభించారు.
విగతజీవిగా చిన్నారి..
తల్లిదండ్రులకు ఉదయం చిన్నారి మృతదేహం కనిపించింది. విగతజీవిగా మారిన చిన్నారిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఆరేళ్ల చిన్నారి ఏం పాపం చేసిందని హత్య చేశారంటూ... వారు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ఈ ఘటనతో గ్రామస్థులూ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యతో పాటు అత్యాచారం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: భార్య అసహజ కోరికలు.. తీశాయి భర్త ప్రాణాలు!