ఫేస్‌బుక్ స్నేహం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఓ మహిళ చేసిన పొరపాటు అభం శుభం తెలియని చిన్నారి హత్యకు దారితీసింది. తల్లిపై కోపంతో ఆమె స్నేహితుడు... చిన్నారిని కిరాతకంగా చంపాడు. అంతటితో ఆగకుండా ఆమెతో పాటు మరో యువకుడిపైనా కత్తితో దాడిచేశాడు.
యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన కల్యాణ్‌రావు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన అనూషతో 2011లో ప్రేమ వివాహం జరిగింది. దంపతులిద్దరూ రెండేళ్లుగా ఘట్కేసర్ మండలం పోచారం పురపాలక సంఘం పరిధిలోని ఇస్మాయిల్ఖాన్ గూడలోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వీరికి ఐదేళ్ల ఆద్య అనే చిన్నారి ఉంది. చిన్నారి తల్లి అనూషకు 3 నెలల క్రితం ఫేస్‌బుక్‌లో కరుణాకర్ పరిచయమయ్యాడు. వీరి స్నేహం ఇలా సాగుతుండగా.. కరుణాకర్ ద్వారా అనూషకు రాజశేఖర్ పరిచమయ్యాడు. కొద్దిరోజులుగా రాజశేఖర్‌తో స్నేహంగా ఉంటున్న అనూష కరుణాకర్‌ను దూరం పెట్టింది. అయితే ఈ రహస్య స్నేహితులు ఎవరు, వారికున్న పరిచయం ఏంటి అనేది అనూష భర్తకు అసలే తెలియదు.
అనుమానం నిజమైంది..
స్నేహితుడు రాజశేఖర్‌పై అనుమానంతో ఉన్న కరుణాకర్ అనూష ఇంటిపై నిఘా ఉంచాడు. గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో రాజశేఖర్ అనూష ఇంటికి వచ్చాడు. రాజశేఖర్ ద్విచక్ర వాహనం, చెప్పులు, ఇంటి తలుపులు మూసి ఉండటం గమనించిన కరుణాకర్ తన అనుమానం నిజమైందనుకున్నాడు. సర్జికల్ కత్తితో అనూష ఇంట్లోకి ప్రవేశించాడు. కరుణాకర్ వచ్చిన విషయాన్ని గమనించిన అనూష రాజశేఖర్‌ను బాత్ రూంలో దాచింది.
దాడి అనంతరం తనని తాను..
గదిలో నుంచి బయటకు రావాలని రాజశేఖర్‌ను కరుణాకర్ ఒత్తిడి చేశాడు. బయటకు రాకపోతే అనూష ఐదేళ్ల కూతురు ఆద్యను చంపుతానని బెదిరించాడు. రాజశేఖర్ బయటకు రాకపోయే సరికి అన్నంత పని చేశాడు ఆ కిరాతకుడు. చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. చిన్నారి అరుపులతో రాజశేఖర్ బయటకు రాగా.. కత్తితో దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు రాజశేఖర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఆపై తన రెండు చేతులు, గొంతు కోసుకుని ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు.
నాకు ఎందుకు అన్యాయం చేశావ్?
'అనూష నిన్ను చాలా బాగా చూసుకున్నా.. నాకు ఎందుకు అన్యాయం చేశావంటూ' గట్టిగా కేకలు వేశాడు. చిన్నారి తీవ్ర గాయాలతో ఉండటం గమనించిన స్థానికులు ఆద్యను, అనూషను ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి ఆద్య చనిపోయిందని వైద్యులు ధృవీకరించారు. కరుణాకర్‌ను 108 వాహన సిబ్బంది ఉప్పల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి, ఏసీపీ నరసింహారెడ్డి, సీఐ రఘువీరారెడ్డి పరిశీలించారు.
ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు...ఇద్దరి ఫేస్‌బుక్ చాట్‌ను పరిశీలించటంతో పాటు పరారైన రాజశేఖర్‌నూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇవీ చూడండి: ఐదేళ్ల బా