బోయిన్పల్లి అపహరణ కేసులో పోలీసులు మరో 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఒక్కొక్కరి పాత్రపై పూర్తి వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న మాజీ మంత్రి అఖిల ప్రియ కస్టడీ విచారణలో భాగంగా సీన్ టు సీన్ వివరాలు సేకరించినట్లు తెలిపారు. పోలీసుల అదుపులో ఏపీలోని విజయవాడకు చెందిన సిద్ధార్థతో పాటు మరో 14 మంది ఉన్నారని వెల్లడించారు.
సీన్ టూ సీన్...
ప్రవీణ్ కుమార్ సోదరుల అపహరణకు భార్గవరాం, గుంటూరు శ్రీను, అఖిల ప్రియ కలిసి కేపీహెచ్‌బీలోని లోధా అపార్ట్ మెంట్లో ఈనెల 2 న పథకం రచించారు. నాల్గవ తేదీన ఎంజీహెచ్ పాఠశాలలో మరోసారి సమావేశమయ్యారు. అయితే ఈ అపహరణ కోసం... కావాల్సిన మనుషులను గుంటూరు శ్రీనుకు తెలిసిన సిద్ధార్థ్ అనే ఈవెంట్ ఆర్గనైజర్ సరఫరా చేశారు. ఏపీలోని విజయవాడకు చెందిన 20 మంది ఈ కిడ్నాప్‌లో పాల్గొన్నారు.
ఇందుకోసం సిద్ధార్థకు 5లక్షలు రూపాయలతో పాటు తలా రూ.25వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. హీరో సూర్య నటించిన గ్యాంగ్ చిత్రంలో మాదిరిగా... 20 మందికి కావాల్సిన దుస్తులను కుట్టించారు. అందరికీ పథకాన్ని వివరించారు. కిడ్నాప్ కోసం ఉపయోగించే వాహనాల నంబర్ ప్లేట్లను కూడా మార్చేశారు. నకిలీ నంబర్లతో ఉన్న పేపర్లను అతికించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. ప్రవీణ్ సోదరుల ఇంటి వద్ద సంపత్, చెన్నయ్యలు రెక్కీ చేసి... కిడ్నాప్‌కు పాల్పడ్డారు. ఇంట్లో చొరబడి... అందరి వద్ద నుంచి ఫోన్లు లాగేసుకున్నారు. ముగ్గురిని వేరు వేరు వాహనాల్లో ఎక్కించుకుని... పలు స్టాంపు పేపర్లలో సంతకాలు తీసుకున్నారు. అనంతరం వాహనాల్లో నుంచి దింపేసి వెళ్లిపోయారు.
సిద్ధార్థతో పాటు మోగిలి బొజ్జగాని దేవ, భాను, రాగోలు అంజయ్య, పదిర రవిచంద్ర, రాజ, బనోత్ సాయి, దేవరకొండ కృష్ణ సాయి, దేవరకొండ కృష్ణవంశీ, దేవరకొండ నాగరాజు, బొజ్జగాని సాయి, కందుల శివ ప్రసాద్, మీసాల శ్రీను, అన్నపాక ప్రకాశ్, షేక్ దావూద్‌కు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అపహరణకు సంబంధించి నిందితుల నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలిపిన సీపీ... పరారీలో ఉన్న భార్గవరామ్, జగత్ విఖ్యాత్ రెడ్డి, కిరణ్మయి, చంద్రహాస్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వివరించారు.