ఇజ్రాయెల్‌పై గాజాలోని పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్ దాడులు చేశారని ఆ దేశ సైన్యం వెల్లడించింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని తీరప్రాంతం ఆష్కెలాన్ లక్ష్యంగా రెండు రాకెట్లను ప్రయోగించారని పేర్కొంది. అయితే.. తమ దేశ వైమానిక దళ సిబ్బంది రాకెట్లను ధ్వంసం చేశారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.
ఇజ్రాయెల్ దాడి.. సిరియా ప్రతిదాడి..
మరోవైపు.. ఇజ్రాయెల్, సిరియా మధ్య క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని జెట్ విమానాలు శుక్రవారం ఉదయం లెబనాన్ భూభాగంలో అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించినట్టు సమాచారం. రాజధాని బీరుట్ గగనతలంలో క్షిపణులు ఎగరటం తాము చూశామని కొందరు పౌరులు తెలిపారు. ఇదే సమయంలో సిరియాకు చెందిన మాసైయాఫ్ నగరంలో పేలుళ్లు సంభవించినట్టు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇక్కడి హమా ప్రాంతంలో దాడి చేసిందని.. ఇందుకు సిరియా వైమానిక దళం దీటుగా స్పందించిందని ఆ దేశ మీడియా ప్రకటించింది. కాగా, ఏ లక్ష్యం కోసం ఈ దాడి జరిగిందీ, మృతుల సంఖ్య తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్రిస్మస్ పర్వదినాన దాడులు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: చైనా టీకాలపైనే పేద దేశాల ఆశలు- పనిచేస్తాయా?