ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ న్యెతన్యాహుకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలు శనివారం మిన్నంటాయి. పదవి నుంచి దిగిపోవాలని ఆ దేశ రాజధాని జెరుసలేంలో చేపట్టిన ఆందోళనల్లో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. దేశమంతటా ప్రధాన కూడళ్ల వద్ద ఆందోళనలు నిర్వహించారు. తీవ్ర చలిలోనూ వెనక్కి తగ్గకుండా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అవినీతికి పాల్పడుతున్నాడంటూ న్యెతన్యాహుపై గతకొంతకాలంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానిగా బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. కరోనాను అరికట్టలేకపోయారని దుయ్యబట్టారు. అయితే ఈ ఆరోపణలను న్యెతన్యాహు కొట్టిపారేస్తున్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్లో దాదాపు నాలుగో వంతు ప్రజలు కరోనా టీకా మొదటి డోసును తీసుకున్నారు.
వచ్చే మార్చిలో ఆ దేశంలో నాలుగోసారి జాతీయ స్థాయి ఎన్నికలు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధిలోనే ఎన్నికలు జరగటం గమనార్హం. ఈ ఎన్నికలకు కరోనా టీకా పంపిణీనే ప్రధాన అస్త్రంగా ముందుకు సాగుతున్నారు న్యెతన్యాహు.