లెబనాన్ నియమిత ప్రధానమంత్రి మౌస్తఫా ఆదిబ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ ప్రతిష్టంభన మధ్య పదవిని విడిచిపెట్టారు. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఈ దేశంలో రాజకీయ సుస్థితరను తీసుకొచ్చేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ చేసిన ప్రయత్నాలకు గండిపడ్డట్లైంది.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన లెబనాన్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు సంస్కరణలకు నాందిపలికే మంత్రివర్గాన్ని నియమించాలని ఆ దేశ రాజకీయ నేతలపై మేక్రాన్ గత కొంత కాలంగా ఒత్తిడి పెంచుతున్నారు. ఈ దిశగా మేక్రాన్ మద్దతుదారు ఆదిబ్ చేస్తోన్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రధాన షియా వర్గాలైన హెజ్బొల్లా, అమల్ మధ్య పదవుల పంపకాలపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఆర్థిక మంత్రిత్వ శాఖను అట్టిపెట్టుకునే అంశంపై ఇరువర్గాలు మొండిపట్టుదల ప్రదర్శించాయి. కొత్త మంత్రివర్గంలో షియా మంత్రులను చేర్చుకోవాలని ఈ బృందాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా తమను సంప్రదించకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆదిబ్ తీరును తప్పుబట్టాయి.
ఈ నేపథ్యంలోనే శనివారం ఓ సమావేశం అనంతరం ఆదిబ్ రాజీనామా ప్రకటన చేశారు. మంత్రివర్గం ఏర్పాటుకు తాను చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని పేర్కొన్నారు. అయితే జాతీయ ఐక్యతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ హరీ!
గతంలో ఫ్రాన్స్ అధీనంలో ఉన్న లెబనాన్.. ప్రస్తుతం అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అప్పులు కూడా చెల్లించలేని స్థాయికి ఆర్థిక వ్యవస్థ దిగజారింది. స్థానిక కరెన్సీ రేటు పడిపోయింది. దేశంలో భయంకరమైన ద్రవ్యోల్బణం ఏర్పడింది. నిరుద్యోగం, పేదరికం తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఆగస్టు 4న బీరుట్లో జరిగిన పేలుడుతో లెబనాన్ మరింత కుంగిపోయింది. ఈ ఘటనలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది గాయపడగా.. వందల కోట్ల డాలర్ల నష్టం సంభవించింది.
కీలకమైన సంస్కరణలు అమలు చేస్తే గానీ లెబనాన్‌కు సాయం చేసేది లేదని ఫ్రాన్స్ సహా ఇతర దేశాలు తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లెబనాన్‌లో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఫ్రాన్స్ చెబుతోంది. ఆ దేశానికి చివరి అవకాశంగా కీలకమైన రోడ్‌మ్యాప్‌నూ రూపొందించింది ఇమ్మాన్యుయేల్ సర్కార్.
ఇదీ చదవండి- ప్రజాగ్రహంతో లెబనాన్ ప్రధాని రాజీనామా