ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అవినీతి ఆరోపణలపై విచారణ ఎదుర్కోనున్నారు. అధికారంలో ఉన్న ఓ ప్రధాని ఇలా విచారణ ఎదుర్కోవడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. అవినీతి, మోసం, నమ్మక ద్రోహాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై మూడు వేర్వేరు కేసులను నమోదు చేసినట్టు ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ అవిచాయ్ మండెల్బ్లిట్ ప్రకటించారు. ఈ మూడు కేసుల్లో నెతన్యాహు మీద ఛార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపారు. దీంతో బెంజమిన్ వ్యక్తిగత, రాజకీయ భవితవ్యం చిక్కుల్లో పడనుంది.
పదవి నుంచి దించేందుకు కుట్ర..
ఇది తనను పదవి నుంచి దింపడానికి పోలీసులు, న్యాయాధికారులు కలసి చేస్తున్న కుట్ర అని నెతన్యాహు ఆరోపించారు. ఇజ్రాయెల్ అటార్నీ జనరల్ ప్రకటన దేశానికి కళంకం అని పేర్కొన్నారు.
కట్టుకథలు..
దేశి ప్రధానిపై వచ్చిన ఆరోపణలు కట్టుకథలని, ఆయన నిర్దోషి అని ఆ దేశ న్యాయ శాఖ మంత్రి యారివ్ లెవిన్ అన్నారు. నెతన్యాహు అవినీతిపరుడు కాదంటూ ఆయన ట్విట్టర్‌లో వెలువరించారు.
పెద్ద ఎత్తున నిరసనలు..
ఇజ్రాయెల్‌లో చాలా చోట్ల ప్రధానికి మద్దతుగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. కానీ అటార్నీ జనరల్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల వరకూ చాలా మంది శాసనసభ్యులు పెదవి విప్పకపోవడం, లికుద్ పార్టీపై నెతన్యాహుకు పట్టు సడలుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమని పలువురు అంటున్నారు.
ఇదీ చూడండి: సంక్షోభం మధ్య ప్రధానిపై అవినీతి ఆరోపణలు