సైనిక అవసరాల కోసం కృత్రిమ ఉపగ్రహం 'నూర్'ను ప్రయోగించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ ప్రకటించింది. భూమి ఉపరితలానికి 425 కిలోమీటర్ల పైన కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ వెబ్సైట్లో పేర్కొంది.
సైనిక అవసరాల కోసం శాటిలైట్‌ను ప్రయోగించటం ఇరాన్లో ఇదే మొదటిసారి కావటం విశేషం.
అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు. స్వతంత్ర ధ్రువీకరణ లేని కారణంగా ఈ ప్రయోగానికి రహస్య అంతరిక్ష కార్యక్రమమని పేర్కొంటున్నారు.
బాలిస్టిక్ క్షిపణుల కోసమేనా?
అమెరికా, ఆ దేశ రక్షణ శాఖ పెంటగాన్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. అయితే ఈ సాంకేతికతతో ఇరాన్.. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి ఏక పక్షంగా వైదొలుగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018లో ప్రకటించారు. అప్పటి నుంచి అగ్రరాజ్యాలు విధించిన అన్ని పరిమితులను ఇరాన్ ఉల్లంఘిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
ఇదీ చూడండి: ఖాసీం మృతితో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు!