ఇరాన్‌లో కనీసం రెండున్నర కోట్ల మందికి కరోనా వైరస్ సంక్రమించి ఉండొచ్చని ఆ దేశ అధ్యక్షుడు హసన్ రౌహనీ అన్నారు. మహమ్మారిని ప్రజలు తీవ్రంగా పరిగణించి జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆరోగ్యశాఖ చేసిన అధ్యయనంలో గతంలో ఊహించని సంఖ్యలో కేసులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.
రాబోయే నెలల్లో మూడు నుంచి మూడున్నర కోట్ల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉందని రౌహనీ అంచనా వేశారు. ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగాలేవని పేర్కొన్నారు. అయితే వేటి ఆధారంగా ఆ నివేదికను రూపొందించారో ఇరాన్ అధికారులు బహిర్గతం చేయలేదు. గత 150 రోజుల్లో ఆస్పత్రుల్లో చేరినవారి కన్నా రెట్టింపు సంఖ్యలో రాబోయే రోజుల్లో చేరతారని రౌహనీ అన్నారు.
ఇరాన్‌లో 2,70,000కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 13,979 మంది మరణించారు. శనివారం 166 కొత్త కేసులు నమోదు కాగా.. 188 మంది మృతిచెందారు. కేసులు పెరుగుతుండటం వల్ల రాజధాని టెహ్రాన్‌లో మళ్లీ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జనాలు ఎక్కువగా గుమిగూడే అవకాశమున్న వ్యాపార, వాణిజ్య ప్రాంతాలను మూసేయనున్నారు. ఇప్పుడున్న అధికారిక గణాంకాల కన్నా రెట్టింపు సంఖ్యలో మృతులు ఉంటారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: 'అందుకే మాస్క్ ధరించమని ఆదేశించను'