Russia Ukraine News: తమ దేశంలో ఏ ఒక్క ప్రాంతాన్ని వదులుకోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. 'మా దేశంలో ఏ భూభాగాన్ని కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము. ఇప్పటికే ఎంతోమందిని పోగొట్టుకున్నాం . అందుకే సాధ్యమైనంత ఎక్కువకాలం స్థిరంగా ఉండాలి. కానీ ఇది జీవితం. ఎన్నో భిన్నమైన పరిస్థితులు ఎదురుపడుతుంటాయి. శాంతి చర్చల్లో భూభాగాలకు సంబంధించిన అంశాలు చర్చకు వస్తాయని నాకు స్పష్టంగా అర్థమైంది. కానీ మేం వాటిని వదులుకోవడానికి సిద్ధంగా లేము. మేం అలా ఉండి ఉంటే.. అసలు యుద్ధం వచ్చేదే కాదు' అని జెలెన్‌స్కీ వెల్లడించారు.
ఇక మేరియుపొల్ నగరాన్ని రష్యా పూర్తిగా స్వాధీనం చేసుకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పుతిన్ సేనలు ధ్వంసం చేశాయి. 40 రోజులకు పైగా తాము చేయాల్సిందంతా చేశామని, ఇక తమ దగ్గర ఆయుధ సామాగ్రి నిండుకుందని అక్కడి ఉక్రెయిన్ సేనలు ఇప్పటికే వెల్లడించాయి. శత్రువు తమను చుట్టుముట్టిందని పేర్కొన్నాయి. ఫిబ్రవరి నుంచి కొనసాగుతోన్న ఉక్రెయిన్ సంక్షోభం ఎన్నో విషాద ఘటనలను కళ్లముందు ఉంచింది. ఎన్నో ప్రాణాలు బలయ్యాయి. చిన్నారులు అనాథలుగా మారారు. ఇంకెందరో తమ ప్రాంతాలను వీడి, శరణార్థులుగా మిగిలారు. మరోపక్క శాంతి చర్చలు జరుగుతున్నా.. ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు.
ఇదీ చదవండి: లక్ష్యం చేరేదాక యుద్ధం ఆగదు: పుతిన్