ఏడాది వయసున్న చిన్నారి మెదడు నుంచి పిండాన్ని వైద్యులు బయటకు తీశారు. ఆ చిన్నారికి అనారోగ్యంగా ఉండడం వల్ల తల్లిందండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ.. చిన్నారి తలకు సంబంధించిన పలు సమస్యలతో బాధపడుతోందని వైద్యులు గుర్తించారు. దాంతో పాటు మోటార్ స్కిల్స్(ఒక నిర్దిష్ట పనిని చేయడానికి.. శరీర కండరాలు నిర్దిష్ట కదలికలను కలిగే వ్యవస్థ) సరిగా లేవని గుర్తించారు. వెంటనే సిటీ స్కాన్ చేసి చూడగా.. మెదడులో పిండం ఉందని బయటపడింది. చైనాలోని షాంఘైలో జరిగిన ఈ వింత ఘటన అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది.
ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని వైద్యులు చెప్పారు. ఈ సంఘటనను వైద్య పరిభాషలో 'ఫీటన్ ఇన్ ఫీటు'గా పిలుస్తారని తెలిపారు. ఇక, ఈ చిన్నారి మెదడులో ఉన్న పిండం నాలుగు అంగుళాలు ఉందని.. దానికి పలు అవయవాలతో పాటు వేళ్ల గోర్లు కూడా అభివృద్ధి చెందాయని తెలిపారు. కాగా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే అవి చిన్నారి మెదడులో అభివృద్ధి చెంది ఉంటాయని వైద్యులు భావిస్తున్నారు.
ఇలా ఎందుకు జరిగింది?
తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవల పిల్లల్లో.. ఒక పిండం ఎదిగి మరో పిండం ఎదగకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయని వైద్యులు తెలిపారు. అంటే, పిండాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు విభజన సరిగా జరగక.. ఒక పిండం మొదడులో మరో పిండం కలిసిపోయింది. బిడ్డ పుట్టేటప్పటి వరకు ఈ పిండం గర్భస్థ శిశువుతో పాటు మెదడులో పెరిగింది. అనంతరం మెదుడులో అలాగే ఉండిపోయింది. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు 200 వరకు జరిగాయని.. అందులో 18 మాత్రమే మెదడుకు సంబంధించినవని వైద్యులు తెలిపారు. పొత్తి కడుపు, నోరు, పేగులు, అండకోశములో కూడా ఇలాంటి పిండాలు బయటపడ్డాయని చెప్పారు.
అయితే, బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆ పిండం అలాగే ఉండిపోయింది. దానికి కారణం.. ఆ చిన్నారి రక్త సరఫరాను ఆ పిండం పంచుకోవడమే. ఈ కారణంగా మెదడులో ఫ్లూయిడ్ నిండిపోయి.. మెదడు వాచిపోవడం, నిద్రలేమి లాంటి సమస్యలు వచ్చాయి. అయితే వీటన్నిటి వల్ల ఆ చిన్నారి దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనే విషయంపై స్పష్టత లేదు. గర్భంలోని కవలల విభజన అసంపూర్ణంగా జరిగినందునే చిన్నారికి ఈ సమస్య వచ్చిందని.. ఆమెకు చికిత్స చేసిన ఫుడాన్ యూనివర్సిటీలోని హుయాసన్ హాస్పిటల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జోంజే తెలిపారు.