Afghan: తాలిబన్ల వశమైన అఫ్గానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి మహిళా ఉద్యోగులకు తాలిబన్లు తాజాగా ఓ హుకుం జారీ చేసినట్లు సమాచారం. తమ స్థానంలో బంధువులైన పురుషులను ఉద్యోగాలకు పంపాల్సిందిగా మహిళా ఉద్యోగులకు తాలిబన్లు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు 'ది గార్డియన్' వార్తాసంస్థ ఓ కథనంలో పేర్కొంది. తన స్థానంలో ఉద్యోగానికి పురుషుడిని పంపాల్సిందిగా తాలిబన్ అధికారుల నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చినట్లు ఓ మహిళా ఉద్యోగి తెలిపారని గార్డియన్ వెల్లడించింది.
ఆర్థికశాఖలో ఉద్యోగిగా పనిచేస్తున్న సదరు మహిళ మాట్లాడుతూ.. 'తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను డిమోట్ చేశారు. నా జీతాన్ని 60వేల అఫ్గాన్ పౌండ్ల నుంచి 12వేల పౌండ్లకు కుదించారు. దీంతో నా కుమారుడి స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతున్నా. ఈ విషయంపై పైఅధికారిని ప్రశ్నిస్తే.. పనిచేయడం ఇష్టంలేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపో అని నిర్మొహమాటంగా చెప్పేశాడు' అని ఆ మహిళ వాపోయారు.
తాజాగా తన స్థానంలో పురుషులైన బంధువులను భర్తీ చేయాలని కోరుతూ మంత్రిత్వ శాఖలోని మానవ వనరుల విభాగం నుంచి తనకు కాల్ వచ్చిందని మహిళ తెలిపారు. గత 15 ఏళ్లుగా తాను ఈ ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆమె మంత్రిత్వ శాఖలోని ఓ విభాగానికి అధిపతి. అయితే అర్హత, నైపుణ్యం ఉన్న వీరి స్థానంలో సరైన అర్హత లేనివారు ఎలా పనిచేస్తారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అఫ్గాన్‌లో మహిళా ఉద్యోగులపై ఆంక్షల కారణంగా ఆ దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా బహోస్ కొద్దిరోజుల క్రితం పేర్కొన్నారు. ఈ పరిస్థితులు అఫ్గానిస్థాన్ జీడీపీలో 5శాతం వరకు తక్షణ ఆర్థిక నష్టాలకు దారితీస్తాయని అంచనా వేశారు. దేశం మొత్తం పేదరికంతో విలవిల్లాడుతోందని.. ఆహార అభద్రత, పోషకాహారలోపంతో బాధపడుతోంది అని ఆమె పేర్కొన్నారు.
ఇవీ చదవండి: గుంతలో పడ్డ గున్న ఏనుగు.. సీపీఆర్ చేసి రక్షించిన సిబ్బంది