రష్యాలో రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్ బర్గ్‌లోని ఓ కేఫ్‌లో జరిగిన పేలుడులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉక్రెయిన్‌పై చేస్తున్న యుద్ధంలో మాస్కోకు మద్దతుగా నిలుస్తున్న రష్యా సైనిక బ్లాగర్ వ్లాడ్లెన్ టాటర్స్కీ లక్ష్యంగా ఓ యువతి బాంబు దాడి చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దాడిలో మరో 32 మంది గాయపడగా అందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఘటనకు కారణమని అనుమానిస్తున్న 26 ఏళ్ల దార్యా త్రిపోవా అనే యువతిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. టాటర్స్కీకి దార్యా త్రిపోవా ఇచ్చిన బహుమతిలో బాంబు ఉందని... దాన్ని ఆమె రిమోట్ సాయంతో పేల్చినట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వ్యతిరేకంగా రష్యాలో చేసిన నిరసనల్లో భాగంగా దార్యా త్రిపోవాను గతంలో అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
డాన్ బాస్ ప్రాంతంలో జన్మించిన టాటర్స్కీ... 2014లో దొంగతనం కేసులో అరెస్టై జైలుకెళ్లాడు. ఉక్రెయిన్‌లోని క్రిమియాను 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత జైలు నుంచి తప్పించుకుని వేర్పాటువాదులతో చేతులు కలిపాడు. తర్వాత సైనిక బ్లాగింగ్ వైపు మళ్లిన టాటర్స్కీ... యుద్ధాన్ని ప్రోత్సహించేలా చేసిన బ్లాగ్‌లతో ప్రసిద్ధి చెందాడు.
ఈ పేలుడుకు ఉక్రెయిన్ సెక్యూరిటీ ఏజెన్సీలే కారణమని రష్యాకు చెందిన ప్రముఖ తీవ్రవాద నిరోధక సంస్థ పేర్కొంది. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీకి చెందిన అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌కు చెందిన కొంతమంది ఉక్రెయిన్ ప్రత్యేక సంస్థలకు సహకారం అందించినట్లు తెలిపింది. ప్రస్తుతం అరెస్టైన దార్యా త్రిపోవా... నావల్నీ గ్రూపులో క్రియాశీల మద్దతుదారు అని వెల్లడించింది.
పేలుడు పదార్థాలను తన ద్వారా రవాణా చేస్తున్న విషయం తనకు తెలుసని, అయితే గిఫ్ట్‌లో పెట్టిన విషయం తెలియదని యువతి చెప్పినట్లు సమాచారం. టాటర్స్కీతో ఏం మాట్లాడిందనే అంశంపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నట్లు రష్యా మీడియా వర్గాలు చెబుతున్నాయి. యువతి తీసుకొచ్చిన గిఫ్ట్‌లో బాంబు ఉందని భద్రతా సిబ్బంది ముందుగానే అనుమానించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 'గిఫ్ట్‌ను డోర్ వద్ద వదిలి వెళ్లాలని గార్డ్స్ ఆమెకు సూచించారు. అందులో బాంబు ఉందేమోనని అనుమానించారు. వెంటనే వారు దీనిపై జోకులు వేసి నవ్వుకున్నారు. చివరకు ఆ యువతి గిఫ్ట్‌ను తీసుకెళ్లి టాటర్స్కీకి అందించింది. టాటర్స్కీ సైతం జోకులు వేస్తూ గిఫ్ట్‌ను టేబుల్‌పై పెట్టాడు. ఆ తర్వాత అది పేలిపోయింది' అని ప్రత్యక్ష సాక్షి వివరించారు.